శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 12:33:21

మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యం : మంత్రి తలసాని

మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యం : మంత్రి తలసాని

హైదరాబాద్‌ : మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం, సీఎం కేసీఆర్‌ ఆశయమని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో చేప పిల్లల పంపిణీ, వృద్ధి, మత్స్యకారుల జీవనంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుకోసం కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు చేప పిల్లల పంపిణీ చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల గంగపుత్రులు, ముదిరాజ్‌ కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2016-17 నుంచి చేప పిల్లల పంపిణీని చేపట్టామన్నారు. అప్పటి నుంచి 2016-17లో 1.99 లక్షల టన్నుల చేప ఉత్పత్తి జరిగిందన్నారు. అదే 2017-18లో 2.7 లక్షల టన్నులు.. 2018-19లో 2.94 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందన్నారు. ఒక్కో మత్స్యకారుడికి సగటున రూ.71 వేలు ఆదాయం వచ్చే విధంగా రూపకల్పన చేసినట్లు తెలిపారు. రొయ్య పిల్లల పెంపకాన్ని కోటీ పది లక్షలతో మొదలుపెట్టి ఈరోజు ఐదు కోట్ల వరకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి మత్స్యకారులు ఆర్థికంగా బలపడ్డారని మంత్రి పేర్కొన్నారు.


logo