ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 02:34:04

ఎయిడ్స్‌పై అవగాహన మహిళల్లోనే అధికం

ఎయిడ్స్‌పై అవగాహన మహిళల్లోనే అధికం

  • నిరోధ్‌ వాడకం ప్రయోజనాలపైనా అంతే 
  • తెలంగాణ సహా మెజార్టీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి
  • దేశంలో నాలుగేండ్లలోనే మారిన పరిస్థితి 
  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎయిడ్స్‌ వ్యాధిపై పురుషులతో పోల్చితే మహిళల్లోనే అవగాహన పెరుగుతున్నది. నాలుగేండ్ల కిందటితో పోల్చితే ప్రస్తుతం ఎయిడ్స్‌పై మహిళలు అవగాహన పెంచుకోగా, పురుషుల్లో క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. తెలంగాణతోపాటు దేశంలోని మెజార్టీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నిరోధ్‌ వాడకం వల్ల కలిగే ఉపయోగాల్లోనూ మహిళల్లో అవగాహన పెరిగింది. ఈ విషయంలోనూ పురుషుల్లో అవగాహన తగ్గుతున్నది. ఇలా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో అసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 15-49 మధ్య వయస్కుల వివరాలతో ఈ సర్వేను రూపొందించింది. ఎయిడ్స్‌పై మహిళలకు, పురుషులకు ఏ మేరకు అవగాహన ఉన్నది? నిరోధ్‌ వాడకం వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సోకే తీవ్రతను తగ్గించవచ్చనే అంశంపై ఎంత మేరకు అవగాహన ఉన్నదనే అంశాలపై సర్వేలో పరిశీలనచేశారు. 

తెలంగాణలో ఇలా..

ఎయిడ్స్‌పై అవగాహనను తెలంగాణలో పరిశీలిస్తే.. 2015-16లో 29.5 శాతం మంది మహిళలకు అవగాహన ఉంటే, 2019-20లో అది 30.7 శాతానికి పెరిగింది. అంటే నాలుగేండ్లలో 1.2 శాతం మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన పెరిగింది. పురుషుల విషయానికొస్తే 2015-16లో 50.1 శాతం మందికి అవగాహన ఉంటే, 2019-20కి వచ్చే సరికి 30.5 శాతానికి పడిపోయింది. నాలుగేండ్లలో ఏకంగా 19.6 శాతం మందికి ఎయిడ్స్‌పై అవగాహన తగ్గడం గమనార్హం. ఇక నిరోధ్‌ వాడకం వల్ల ఎయిడ్స్‌ బారిన పడకుండా రక్షించుకోవచ్చు అనే దానిపై అవగాహనను పరిశీలిస్తే.. 2015-16లో 59.1 శాతం మహిళలకు అవగాహన ఉంటే, 2019-20కి వచ్చే సరికి అది 68.9 శాతానికి పెరిగింది. పురుషుల విషయంలో 2015-16లో 81.5 శాతం మందికి దీనిపై అవగాహన ఉంటే, 2019-20కి వచ్చేసరికి 75.3 శాతానికి తగ్గడం గమనార్హం.

గ్రామాల్లో తక్కువ.. పట్టణాల్లో ఎక్కువ

గ్రామాలతో పోల్చితే పట్టణ మహిళలు, పురుషుల్లో ఎక్కువ అవగాహన ఉన్నది. అన్ని రాష్ర్టాల్లోనూ ఇలాగే ఉన్నది. తెలంగాణలో ఎయిడ్స్‌పై గ్రామీణ మహిళల్లో 26.9 శాతం మందికి అవగాహన ఉంటే పట్టణ ప్రాంతంలో 36.9 శాతం మందికి ఉన్నది. పు రుషుల విషయంలో గ్రామా ల్లో 28.9 శాతం మందికి ఉంటే, పట్టణాల్లో 33 శాతం మందికి అవగాహన ఉన్నది. ఇక నిరోధ్‌ వాడకంపై గ్రామీణ మహిళల్లో 65.4 శాతం మందికి అవగాహన ఉంటే, పట్టణాల్లో 74.7 శాతం మందికి ఉన్నది.

కొన్ని రాష్ర్టాల్లో అలా.. మరికొన్ని చోట్ల ఇలా

ఎయిడ్స్‌పై అవగాహన కొన్ని రాష్ర్టాల్లో తగ్గుతుండగా, మరికొన్ని రాష్ర్టాల్లో పెరుగుతున్నది. మెజార్టీ రాష్ర్టాల్లో మాత్రం మహిళల్లోనే అవగాహన ఎక్కువగా పెరుగుతుండటం గమనార్హం. ఏపీ, కేరళ, జమ్మూకశ్మీర్‌ వంటి రాష్ర్టాల్లో మినహా మిగతా చోట్ల మహిళల్లోనే అవగాహన ఎక్కువగా ఉన్నది. మహారాష్ట్రలో మహిళల్లో ఎయిడ్స్‌పై అవగాహన పెరిగితే పురుషుల్లో తగ్గింది. 2015-16లో 30శాతం మంది మహిళల్లో అవగాహన ఉంటే, 2019-20లో అది 34.4 శాతానికి పెరిగింది. పురుషుల్లో గతంలో 44.5 శాతం ఉంటే, అది 42.6 శాతానికి తగ్గింది. ఇక నిరోధ్‌ ఉపయోగంపై గతంలో 67.9 శాతం మహిళల్లో అవగాహన ఉంటే, ప్రస్తుతం అది 72.1 శాతానికి పెరిగింది. అదే పురుషుల్లో 86.4 శాతం నుంచి 84.5 శాతానికి తగ్గింది. ఏపీలో పూర్తిగా ఎయిడ్స్‌ అవగాహన తగ్గడం గమనార్హం. గతంలో ఇక్కడి మహిళల్లో 29.0 శాతం అవగాహన ఉంటే, ప్రస్తుతం అది 24.6 శాతానికి తగ్గింది. నిరోధ్‌ వాడకంపై మహిళల్లో గతంలో 57.5 శాతం మందికి అవగాహన ఉంటే, ప్రస్తుతం 63.0 శాతానికి పెరిగింది. పురుషుల్లో గతంలో 83.4 శాతంగా ఉంటే, ప్రస్తుతం 82.6 శాతానికి తగ్గింది.logo