ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 00:24:48

జైలుకు అగ్రిగోల్డ్‌ చైర్మన్‌

జైలుకు అగ్రిగోల్డ్‌ చైర్మన్‌

  • 14 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు
  • మరో ఇద్దరు డైరెక్టర్లు సైతం..
  • చైర్మన్‌ను కస్టడీ కోరనున్న ఈడీ అధికారులు  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అగ్రిగోల్డ్‌ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. డిపాజిటర్ల నుంచి భారీగా నిధులు సేకరించి మోసానికి పాల్పడిన అగ్రిగోల్డ్‌ కంపెనీ ప్రతినిధులను ఈడీ అధికారులు రిమాండ్‌కు పంపారు. సంస్థ చైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, డైరెక్టర్‌ శేషు వెంకట నారాయణ, హేమసుందర ప్రసాద్‌ను మనీలాండరింగ్‌  కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం వీరిని ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. కోర్టు  14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో మొత్తం 19,18,865 మంది కస్టమర్ల నుంచి రూ. 6,380కోట్ల వరకు అగ్రిగోల్డ్‌ సంస్థ వసూలు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, కుటుంబ సభ్యులు, బంధువులు డైరెక్టర్లుగా మొత్తం 156 వరకు డొల్ల కంపెనీలు స్థాపించి వీటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున వారిని కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్టు సమాచారం.  logo