గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:32:46

పశుపోషణ భేష్‌

పశుపోషణ భేష్‌

-ప్రగతిపథంలో వ్యవసాయ అనుబంధ రంగాలు

 -గతేడాది 6 శాతం అధిక పాల దిగుబడి..   

-మాంసం ఉత్పత్తిలో 15 శాతం వృద్ధి  

-ఈ సారి మరింత ఎక్కువ లక్ష్యం నిర్దేశం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలు అద్భుత ప్రగతిని సాధించాయి. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న పశుసంవర్థక, పాడి, కోళ్ల పరిశ్రమ తెలంగాణ ప్రజల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో కీలకంగా మారాయి. తెలంగాణలో 42.31లక్షల ఆవు జాతి పశువులు, 42.26 లక్షల బర్రెలు, 1.9 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు, 1.78 లక్షల పందులు, 8కోట్ల కోళ్లతో అపార పశుసంపద ఉన్నది. రాష్ట్రంలోని దాదాపు 25.82 లక్షల కుటుంబాలు పశుసంపదను కలిగిఉండి.. పశుపోషణ, దానికి సంబంధించిన కార్యక్రమాలతో జీవనం కొనసాగిస్తున్నాయి. పశుపోషణలో 22.45లక్షల కుటుంబాలు పాడిపశువుల పెంపకంపై, సుమారు 7.15 లక్షల కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. 2019-20లో ఈ రంగానికి రూ.66.403 కోట్ల స్థూల ఆదాయాన్ని సమకూర్చింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఈ రంగం 7.60 శాతం సమకూరుస్తున్నట్టు 2020-21 బడ్జెట్‌లో ప్రకటించిన ఫలితాల్లో పశుసంవర్థకశాఖ వెల్లడించింది. 

పశుఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

దేశంలోనే అధిక పశుసంపద కలిగిన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ.. పశు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. పశువులు, జీవాలకు వ్యాధి నిరోధక చర్యలు చేపట్టడంతోపాటు పశుదాణా, పశుగణాభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపడుతున్నది.  తద్వారా రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి పెంచే దిశగా పశుసంవర్థక శాఖ వచ్చే ఐదేళ్ల కోసం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందుకోసం పశుసంవర్థకశాఖ 2,117 పశువైద్యశాలలను నిర్వహిస్తున్నది. 1,335 గోపాలమిత్రల ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి సేవలు అందిస్తున్నది. 

100 సంచార పశు వైద్యశాలలతో.. 

గొర్రెలు, ఆవులు, గేదెల ఆరోగ్యపరిరక్షణతోపాటు వాటి ఉత్పాదకత శక్తిని కాపాడేందుకు 100 సంచార పశువైద్యశాలల ద్వారా రైతు చెంతకే అత్యవసర పశుచికిత్సలను తీసుకొచ్చింది. పౌల్ట్రీరంగ అభివృద్ధికి ప్రభుత్వం అందించిన కరెంటు సబ్సిడీ, దాణా సరఫరాలో రాయితీ వంటి కార్యక్రమాలతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1464.48కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి నమోదైంది. ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తుండటంతో వార్షిక వృద్ధి 7 శాతం లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. హైదరాబాద్‌లోని వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఆరు రకాల టీకాలను ఉత్పత్తి చేసి పశువులకు ఉచితంగా అందిస్తున్నది. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, జమ్మూకశ్మీర్‌ రాష్ర్టాలకు విక్రయిస్తున్నది. శాస్త్రీయ పద్ధతిలో పశువుల పునరుత్పత్తి, పశు ఆరోగ్యసంరక్షణ, పశుపోషణ ద్వారా ప్రజలకు పాలు, గుడ్లు, మాంసం లభ్యతను పెంపొందించడం ద్వారా రైతుల ఆదాయ మార్గాలను పెంచేందుకు పశుసంవర్థకశాఖ కృషి చేస్తున్నది.

ఉత్పాదకతలో వృద్ధిరేటు నమోదు

2018-19 సంవత్సరంలో తెలంగాణ 1368.68 కోట్ల గుడ్ల ఉత్పత్తితో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. 7.54 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తితో ఐదో స్థానంలో, 54.16 లక్షల మెట్రిక్‌ లీటర్ల పాల ఉత్పత్తితో 13వ స్థానంలో   నిలువగా.. 2019-20లో 57.40 లక్షల మెట్రిక్‌ లీటర్ల పాల ఉత్పత్తి జరిగింది. 2018-19లో ప్రవేశపెట్టిన పథకాలతోపాటు ప్రతి లీటరు పాల సేకరణకు రూ.4 అదనపు ప్రోత్సాహాకాన్ని 2.13లక్షల మంది రైతులకు కొనసాగిస్తున్నది. ఈ పథకం కింద కరీంనగర్‌, ముల్కనూర్‌, నల్లగొండ- రంగారెడ్డి డెయిరీలకు వర్తింపజేసి, పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తూ 6 శాతం వృద్ధి సాధించింది. అదేవిధంగా మాంసం ఉత్పత్తిలో 8.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరిగింది. మాంసం ఉత్పత్తి కోసం రూపొందించిన సబ్సిడీ గొర్రెల పథకం ద్వారా 15 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించింది. కాగా, 2020-21 సంవత్సరంలో పాల ఉత్పత్తిలో 8 శాతం, మాంసం ఉత్పత్తిలో 10 శాతం, గుడ్ల ఉత్పత్తిలో 4 శాతం అభివృద్ధి రేటుతో పశుగణాభివృద్ది రంగం 8 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా నిర్దేశించుకున్నది.


logo