బుధవారం 03 జూన్ 2020
Telangana - May 19, 2020 , 11:33:05

నగరంలో.. నవ జీవనం

నగరంలో.. నవ జీవనం

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నవ జీవనం మొదలైంది. 55 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం హైదరాబాదీలు.. ఇవాళ ఉత్సాహంతో రోడ్లపైకి వచ్చారు. సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వడంతో ఉద్యోగులు, కార్మికులు తమ విధులకు వెళ్తున్నారు. నగరంలో సాధారణ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. అన్ని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారు. 

ఇక దుకాణాలకు సరి - బేసి విధానంలో అనుమతివ్వడంతో.. తమ దుకాణాలను శుభ్రం చేసుకునే పనిలో యజమానులు బిజీ అయిపోయారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో తప్ప అన్ని ప్రాంతాల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వాణిజ్యపరమైన ఏరియాల్లో దుకాణాల యజమానులు, ఉద్యోగులతో సందడి నెలకొంది. ఉదయం 9 గంటలకే తమ విధుల్లో చేరిపోయారు. సికింద్రాబాద్‌, కోఠి ఏరియాల్లో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు. 

రాజధానిలో ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతి లేకపోవడంతో.. తమ పని ప్రాంతాలకు వెళ్లేందుకు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు ఉద్యోగులు, కార్మికులు. కొందరైతే తమ స్నేహితుల వాహనాల్లో వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలను పాటిస్తున్నారు.

నగరంలోని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు, మోండా మార్కెట్‌, రాణిగంజ్‌, జనరల్‌ బజార్‌, బైబిల్‌ హౌస్‌, ఎస్‌డీ రోడ్డు ప్రజలతో కళకళలాడుతోంది. సంగీత్‌ జంక్షన్‌, ప్యాట్నీ సెంటర్‌, ప్యారడైజ్‌ సర్కిల్‌, రాణిగంజ్‌తో పాటు లక్డీకాపూల్‌, మాసాబ్‌ట్యాంక్‌, పంజాగుట్ట సర్కిల్‌లో వాహనాల రద్దీ అధికంగా ఉంది. 


logo