శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:21:10

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సంక్రాంతి తర్వాతే!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సంక్రాంతి తర్వాతే!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు ఎన్నికలు.. షెడ్యూల్‌ ప్రకారమే జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం 2021 ఫిబ్రవరి 10 వ తేదీ వరకు ఉన్నది. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న కొన్ని వర్గాల వాదనను అధికారవర్గాలు కొట్టిపారేశాయి. పాలకవర్గం గడువు ముగియడానికి దాదాపు మూడు నెలల సమయం ఉన్నందున అప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాయి. హైదరాబాద్‌లో వరద బాధిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు, బాధితులకు సహాయ చర్యలు ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి మొత్తం వాటి మీదనే ఉన్నదని తెలిపాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా ఈ పనుల్లోనే తలమునకలై ఉన్నారని గుర్తుచేశాయి. 

ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టంచేశాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యవహారం ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు వెళ్లలేదని, ఆయన ఇప్పటికి ఈ అంశంపై దృష్టి సారించడమే జరుగలేదని అధికారవర్గాలు ఉటంకించాయి. అందువల్ల షెడ్యూలుకన్నా ముందు ఎన్నికలు జరిగే అవకాశం లేదని పునరుద్ఘాటించాయి. సంక్రాంతి తరువాత జనవరి చివరివారంలో షెడ్యూలు విడుదలై, ఫిబ్రవరి మొదటివారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని అధికారవర్గాలు పేర్కొన్నాయి.