శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 19:57:44

త్వరలోనే గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ : ఎస్‌ఈసీ

త్వరలోనే గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ : ఎస్‌ఈసీ

హైదరాబాద్ :   గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ( జీహెచ్‌ఎంసీ) ఎన్నికల సన్నాహక  ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 13న ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తరువాత ఎప్పుడైనా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి తెలిపారు.  మంగళవారం ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్‌ అధికారుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకమని పారదర్శకంగా విధులు నిర్వహించాలని వారికి సూచించారు.  ఎన్నికల నిబంధనలపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులకు 150 మంది రిటర్నింగ్‌ అధికారులు ఉంటారని తెలిపారు. ఒక్కో వార్డు పరిధిలో 50 పోలింగ్‌ కేంద్రాలుంటాయని, పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌, వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను  ఆదేశించారు. విశాలమైన స్థలం, మంచి వెలుతురు, ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్న పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికతను సిద్ధం చేయాలని సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.