బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 18:02:20

మహబూబ్‌న‌గ‌ర్‌లో ఏరో స్పోర్ట్స్ పారామోటార్ అడ్వెంచర్ శిక్షణ కేంద్రం

మహబూబ్‌న‌గ‌ర్‌లో ఏరో స్పోర్ట్స్ పారామోటార్ అడ్వెంచర్ శిక్షణ కేంద్రం

మహబూబ్‌న‌గ‌ర్ : ఏరో స్పోర్ట్స్ పారా మోటార్ అడ్వెంచర్ శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే మహబూబ్‌న‌గ‌ర్‌లో నేలకొల్పబోతున్నట్లు రాష్ట్ర క్రీడ‌లు, పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్ల మధ్యలో ఈ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పనున్న‌ట్లు తెలిపారు. మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో జ‌రుగుతున్న‌ ఎయిర్ షో, పారా మోటార్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా గురువారం మంత్రి పారా మోటార్ జాయ్ రైడింగ్‌లో పాల్గొన్నారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా అంతర్జాతీయస్థాయిలో నిర్వహించే జాతీయ పారా మోటార్ చాంపియన్‌షిప్‌ను మహబూబ్‌న‌గ‌ర్‌లో నిర్వహించడం జిల్లాకే  గర్వకారణమన్నారు. యువతలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపటానికే మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఎయిర్ షో, పారా మోటార్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో అమ్మాయిలు ఎక్కువ మంది పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. ఇలాంటి విన్యాసాలు కేవలం సింగపూర్, మలేషియా, థాయిలాండ్ దేశాలలో మాత్రమే జరుగుతాయన్నారు. అలాంటి పోటీలు మహబూబ్‌న‌గ‌ర్‌లో నిర్వహించడం జిల్లాకే గర్వకారణమన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చేందుకు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దృష్టిలో ఉంచుకొని యువత చెడు బారిన పడకుండా సాహస క్రీడల పట్ల మంచి మార్గంలో పయనించే అవకాశం కలుగుతుందన్నారు. 

గతంలో మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా అంటే కరువు జిల్లాగా మాత్రమే పేరు ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం వివిధ రంగాలలో అభివృద్ధి సాధించి అనేక కార్యక్రమాలలో ముందు ఉందన్నారు. జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు. దేశంలోనే అతి పెద్దదైన ఎకో పార్కు, పిల్లలమర్రి, సోమశిల వంటి పర్యాటక క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్‌, సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ నర్సింలు, డీసీసీబీ ఉపాధ్యక్షులు వెంకటయ్య, జిల్లా పర్యాటక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడలు యువజన సర్వీసులు అధికారి శ్రీనివాస్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్టికల్ వరల్డ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు .logo