గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 02:47:21

కమ్మని మాటలతో టోకరా!

కమ్మని మాటలతో టోకరా!

  • తక్కువ ధరకే కార్లు, లాటరీ అంటూ ఎర
  • తెలంగాణ, కర్ణాటక ప్రజలే ప్రధాన లక్ష్యం
  • ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలే పెట్టుబడిగా మోసం
  • నిలువుదోపిడీ చేస్తున్న భరత్‌పూర్‌ గ్యాంగులు
  • ఊచలు లెక్కపెట్టిస్తున్న తెలంగాణ పోలీసులు
  • ప్రాణాలకు తెగించి మరీ సెర్చ్‌ ఆపరేషన్లు 

లక్ష రూపాయలు పలికే కారును రూ.30 వేలకే ఇస్తాం అంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇస్తారు. దాన్ని చూసి, ఆశపడి ఫోన్‌ చేశామో! మన జేబుకు చిల్లు పెడ్తారు.. బ్యాంక్‌ ఖాతాను ఖాళీ చేస్తారు. కమ్మని మాటలు చెప్తూ కాసులన్నీ ఖతం చేస్తారు. తెలంగాణ, కర్ణాటక ప్రజలే లక్ష్యంగా రాజస్థాన్‌కు చెందిన భరత్‌పూర్‌ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. అమాయకులకు ఎర వేసి రూ.లక్షలు దోచుకుంటున్నాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:ఎక్కడో రాజస్థాన్‌లోని మారుమూల పల్లెల్లో కూర్చొని సైబర్‌ కేటుగాళ్లు ఇక్కడి మన జేబులను ఖాళీ చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లోని ప్రజలను టార్గెట్‌ చేస్తూ అమాయకులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలపై నజర్‌ పెట్టిన సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అరకొరగా హిందీ మాట్లాడటం వచ్చినవాళ్లే సైబర్‌ నేరగాళ్లకు ఎక్కువగా బలవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణ, కర్ణాటకలో ఉండే ప్రజలకు హిందీ పూర్తిగా రాకపోయినా, కాస్తోకూస్తో మాట్లాడటం తెలుసు. అలాంటి వాళ్లను గుర్తించి హిందీలో మాట్లాడటం షురూ చేస్తారు. తాము చెప్పినట్టు వింటున్నారని తెలియగానే లాటరీ తగిలిందని బ్యాం కు వివరాలు అడిగి ఖాతాల్లో డబ్బులను నొక్కేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనల పేరుతోనూ దోపిడీలకు పాల్పడుతున్నారు. తక్కువ రేటుకే కారు, బైక్‌ అమ్ముతామని ప్రకటన ఇస్తారు. అది చూసి మనం ఫోన్‌ చేస్తే మెల్లగా లైన్‌లోకి దింపి బురిడీ కొట్టిస్తారు. తాము మిలటరీ అధికారులమని, వేరే చోటుకు బదిలీ అవ్వడంతో కారును అమ్మాలనుకొంటున్నామని చెప్తారు. మనం నమ్మేందుకు ఫేక్‌ ఐడీ ప్రూఫ్‌లను కూడా వాట్సాప్‌ చేస్తారు. ప్రస్తుతం తాము వేరేచోట ఉన్నామని, కొంత అడ్వాన్స్‌ పంపితే వాహనం కొరియర్‌ చేస్తామని చెప్తారు. తర్వాత రిజిస్ట్రేషన్‌ ఫీజు అని, రోడ్‌ ట్యాక్స్‌ అని అందినకాడికి గుంజుతున్నా రు. తీరా డబ్బులు జమచేశాక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తారు. ఆ సిమ్‌కార్డును ధ్వంసం చేస్తారు. ఫోన్‌ను కూడా తిరిగి వాడకుండా సెకండ్‌హ్యాండ్‌ ఫోన్లమార్కెట్లలో అమ్మేస్తున్నారు. మళ్లీ కొత్త సిమ్‌కార్డులు, కొత్త ఫోన్లతో నయా మోసం షురూ చేస్తారు.

ఐదారు వందల గ్రామాల్లో ముఠాలు

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో ఐదారు వందల గ్రామాల్లో ఇలాంటి చోరీముఠాలు ఉన్నాయి. వీళ్లు రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు కొల్లగొడుతున్నట్టు అంచనా. డబ్బుల్ని జమ చేయించుకొనేందుకు అన్నీ ఫేక్‌ డాక్యుమెంట్లతో తెరిచిన బ్యాంకు ఖాతాలనే వాడతారు. స్థానికంగా కొందరు కమీషన్లు తీసుకొని వీళ్లకు బ్యాం కు ఖాతాలను అమ్ముతుంటారు. ఆయా బ్యాంక్‌ ఖాతాల్లోకి ఒక రోజు లో రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు డబ్బులు పడేలా  చూస్తారు. ఖాతాలో జమ య్యే మొత్తం రూ.పది లక్షలకు మించకుండా చూసుకొంటారు. ఆ డబ్బును ఏటీఎంల ద్వారా మాత్రమే డ్రా చేసుకొంటారు. అందుకోసం ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.

దెబ్బకొట్టిన తెలంగాణ పోలీసులు

రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఎక్కువవ్వడంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. అత్యంత ప్రమాదకరమైన రాజస్థాన్‌ ముఠాల డెన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ సైబర్‌ కేటుగాళ్లను గుంజుకొస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్ర పోలీసులు చేయని సాహసం చేస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో వరుస సెర్చ్‌ ఆపరేషన్లతో దాదాపు వంద మందిని కటకటాల పాలుచేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల ప్రత్యేక బృందాలు నిరంతరం అక్కడే మాటువేస్తూ దొరికినవాడిని దొరికినట్టు లాక్కొస్తున్నాయి. 

ప్రకటనలు చూసి మోసపోవద్దు

ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకే కార్లు అమ్ముతామని, మీకు లాటరీ వచ్చిందని, బ్యాంక్‌ ఖాతా వివరాలు సరిచేయాలని ఎవరైనా ఫోన్లు చేస్తే నమ్మొద్దు. ఫోన్‌ చేసేది కచ్చితంగా సైబర్‌ నేరగాళ్లేనని గుర్తించి అప్రమత్తం కావాలి. వీలైనంతవరకు మన వివరాలు చెప్పకుండా ఉండాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే 24 గంటల్లోపే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి పొందేందుకు కొంతవరకైనా అవకాశం ఉంటుంది.

- కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌ క్రైం