శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 01:56:05

ఓరుగల్లులో అధునాతన వైద్యాలయం

ఓరుగల్లులో అధునాతన వైద్యాలయం

  • సిద్ధమైన సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన
  • రూ.120 కోట్లతో నిర్మాణం పూర్తి
  • 250 పడకలతో అత్యాధునిక వైద్యసేవలు
  • ఈ నెలలోనే ప్రారంభానికి ఏర్పాట్లు

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను నిర్మించింది. అత్యాధునిక హంగులతో కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించేలా దీనిని రూపొందించింది. వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో సమకూర్చగా ఈ పెద్ద దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. రూ.120 కోట్లతో 250 పడకల సామర్థ్యంతో ఈ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను నిర్మించారు. ఈ నెలనుంచి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దవాఖాన ప్రారంభమైతే పెద్ద రోగాలకు వైద్యం కోసం పేదలు హైదరాబాద్‌కు వెళ్లే ఇబ్బందులు తప్పనున్నాయి. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని పేదలకు ఇది ఉపయోగకరంగా ఉండనున్నది. ప్రస్తుతం వరంగల్‌లోని ఎంజీఎం దవాఖాన ఉత్తర తెలంగాణలో ప్రభుత్వ సేవల పరంగా పెద్దదిగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాల పరంగా ఎంజీఎంను అభివృద్ధి చేస్తూనే.. అదనంగా ఇప్పుడు సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ ఆవరణలోనే ఈ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను నిర్మించారు. ఇందులో వైద్యసేవలు ప్రారంభమైతే కాకతీయ మెడికల్‌ కాలేజీలోనూ పీజీ కోర్సుల సీట్లు పెరుగనున్నాయి.

2014లో దవాఖాన మంజూరు

2014 డిసెంబర్‌లో వరంగల్‌కు సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన మంజూరైంది. తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో అనుమతులు సాధించింది. 2015 సెప్టెంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఆరు అంతస్తులు, రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక పద్ధతిలో దీనిని నిర్మించారు. సాధారణ వైద్య సేవలతోపాటు ఆపరేషన్లు (సర్జరీలు) అందుబాటులోకి రానున్నాయి. గుండె, మూత్రపిండాలు, నరాల వ్యాధులు, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వైద్యసేవలు పేదలకు ఉచితంగా అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) నిధులు కలిపి ఈ దవాఖానను నిర్మించారు. వైద్యసేవల పరంగా పది డిపార్టుమెంట్లకు 20 పడకల చొప్పున 200 పడకలను కేటాయించారు. అత్యవసర వైద్యసేవల కోసం 50 పడకలను అందుబాటులో ఉంచారు. 13 కిలోమీటర్ల పైప్‌లైన్‌ సామర్థ్యంతో ఆక్సిజన్‌ ట్యాంకును ఏర్పాటుచేశారు. వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లైబ్రరీ, సెమినార్‌ హాళ్లను నిర్మించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వైద్య కేంద్రంగా ఉంటున్న వరంగల్‌లో ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుతో వైద్యరంగంలో ప్రతిష్ఠ మరింత పెరుగనున్నది. సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవల కోసం ఇప్పటివరకు హైదరాబాద్‌ వెళ్లే ఈ ప్రాంత పేదలకు ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి.దవాఖాన స్వరూపం

  • ఆరు అంతస్తులు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం
  • ఏడు ఆపరేషన్‌ థియేటర్లు, ల్యాబ్‌లు, క్యాథలాబ్‌
  • పది డిపార్టుమెంట్లకు 20 పడకల చొప్పున 200 పడకలు
  • అత్యవసర వైద్యసేవలకు 50 పడకలు
  • 13 కిలోమీటర్ల పైప్‌లైన్‌ సామర్థ్యంతో ఆక్సిజన్‌ ట్యాంకు కార్డియాలజీ, అంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీ, కార్డియోథోరాసిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఈఎన్టీ, ట్రామా కేర్‌ సేవలకు అనుగుణంగా యంత్రపరికరాలు


logo