బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 03:33:26

చిరుత @ 500

చిరుత @ 500

  • రాష్ట్రంలో భారీగా పెరిగిన సంఖ్య
  • పచ్చదనంతో ఎక్కువైన వన్యప్రాణులు
  • 33కి చేరిన పెద్దపులులు
  • ఏటీఆర్‌, కవ్వాల్‌ అడవులే అడ్డాలు

రాష్ట్రంలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేండ్ల క్రితం నిర్వహించిన జాతీయ పులుల గణనలో(టైగర్‌ ఎస్టిమేషన్‌ పాపులేషన్‌) 335 చిరుత పులులున్నట్టు తేలింది. ఇప్పుడు వాటి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటుందని అటవీ అధికారులు అంచనావేస్తున్నారు. కవ్వాల్‌, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 33 పెద్దపులులు ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో పచ్చదనం పెరుగడం, అడవుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుండటంతో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతున్నది.   

- ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఏటీఆర్‌, కవ్వాల్‌లో పెరిగిన కో ప్రిడేటర్స్‌

నల్లమల అడవులలో అంతర్భాగంగా ఉన్న అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌(ఏటీఆర్‌)లో 17, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని  కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో మూడు పెద్దపులులున్నట్టు రెండేండ్ల కిందట జరిగిన జాతీయ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో చిరుతల ఉనికినీ గుర్తించారు. పెద్దపులుల గణన సమయంలో వేటాడే జంతువుల (కో-ప్రిడేటర్‌) సంఖ్యనూ లెక్కిస్తారు. అంటే చిరుతపులులు, తోడేళ్లు, నక్కలు, అడవికుక్కలనూ పరిగణనలోకి తీసుకుంటారు. కెమెరాట్రాప్‌లలో నిక్షిప్తమైన ఫొటోలు, పాద ముద్రలు, ప్రత్యక్షంగా చూడటం, అరుపులు వినడం, స్థానికుల నుంచి వివరాలను సేకరించడం ద్వారా వీటి సంఖ్యను అంచనా వేస్తారు. ప్రతి సారీ పెద్దపులుల సంఖ్యను మాత్రమే వెల్లడిస్తున్న కేంద్ర అటవీ,పర్యావరణశాఖ ఈ ఏడు ‘స్టేటస్‌ ఆఫ్‌ లెపర్డ్‌ ఇన్‌ ఇండియా-2018’  పేరిట చిరుతపులుల పరిస్థితినీ వెల్లడించింది. తాజాగా వెల్లడించిన ఈ నివేదికలో దేశ వ్యాప్తంగా దాదాపు 12,852 చిరుత పులులుండగా తెలంగాణలో 335చిరుతలున్నట్లు వెల్లడించింది. చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగిన రాష్ర్టాలలో తెలంగాణ ఆరవ స్థానంలో ఉన్నది.

చిట్టడవుల్లోనూ మనుగడ

రాష్ట్రంలోని అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లతోపాటు  ఏటూరునాగారం, పోచారం, కిన్నెరసాని,శివ్వారం అభయారణ్యాల్లో వీటి ఉనికి బాగా ఉన్నట్లు తేలింది.  కేవలం 60నుంచి 90కిలోల బరువుతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుని మనుగడ సాగించే చిరుత పులుల లెక్క తేల్చాలంటే కొండలు, గుట్టలు, చిట్టడవులు, సాధారణ అడవులలో కూడా సర్వే చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి రాష్ట్రంలో అడవుల లోపల, వెలుపల పచ్చదనం బాగా పెరిగిన క్రమంలో చిరుత పులుల సంతతి కూడా అదే స్థాయిలో పెరిగినట్టు వరుస ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం దట్టమైన అడవులు, రిజర్వ్‌ ఫారెస్ట్‌లతోపాటు నగర శివారు ప్రాంతాలలో సైతం చిట్టడవులు, గుట్టలు ,చెట్లను ఆవాసంగా చేసుకుని మనుగడ సాగించే చిరుతపులుల సంఖ్య రాష్ట్రంలో బాగా పెరిగింది. చిరుత పులులు చిన్న గుట్టలను కూడా ఆవాసంగా మలుచుకుని చిన్న జంతువులు దూడలు, కుక్కలు, కుందేళ్లు, కోతులు, ముళ్ల  పందులను ఆహారంగా తీసుకుని మనుగడ సాగిస్తాయి. అడవుల్లో పచ్చదనం విస్తరించడం, సానుకూల వాతావరణం ఏర్పడటంతో కుందేళ్లు, ముండ్ల పందులు తదితర వన్యప్రాణులు పెరిగాయి. ఈ క్రమంలో చిరుతపులుల సంఖ్య పెరిగినట్టు అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 


logo