గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 02:25:12

పెద్దపులుల ఖిల్లా తెలంగాణ

పెద్దపులుల ఖిల్లా తెలంగాణ

  • l తిప్పేశ్వర్‌, తడోబా, ఇంద్రావతి నుంచి వలసలు
  • l కవ్వాల్‌, అమ్రాబాద్‌  అడవుల్లో అనుకూలత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పెద్దపులల ఖిల్లాగా తెలంగాణ వర్ధిల్లుతున్నది. ప్రభుత్వ అటవీ సంరక్షణ చర్యలు పులుల ఆవాసానికి అనుకూలంగా మారుతున్నాయి. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాల్లో నుంచి రాష్ట్రంలోకి పులుల వలసలు పెరుగుతున్నాయి. తడోబా, తిప్పేశ్వర్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగడంతో, అక్కడ స్థలం సరిపోవటంలేదు. ఇంద్రావతిలోనూ సానుకూల వాతావరణం లేదు. మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగిన సంఖ్యలో జంతువులు, నీటివనరులు తెలంగాణలో ఉండటంతో ఇక్కడికి పులులు వలస వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. దేశంలో 50 టైగర్‌రిజర్వ్‌లు ఉండగా, 2వేలకుపైగా చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న నాలుగైదింటిలో రెండు తెలంగాణలోనే ఉన్నాయి. ఒక పులి స్వేచ్ఛగా జీవనాన్ని సాగించేందుకు 50 చదరపు కిలోమీటర్ల అడవి అవసరం. దీని ఆధారంగా తెలంగాణలో 2,611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌, 2,015 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ పులుల ఆవాసానికి అనుకూలమని అధికారులు చెప్తున్నారు. ఇతర అనువైన అటవీ ప్రాంతాలు కలిపి 5 వేల చదరపు కిలోమీటర్లకుపైగానే దట్టమైన అటవీ విస్తీర్ణం ఉన్నందున ఇక్కడ 100 వరకు పులులు స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అవకాశమున్నదని ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వైల్డ్‌లైఫ్‌ విభాగం ఓఎస్డీ శంకరన్‌ తెలిపారు. 


logo