బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 21:37:16

దండేపల్లిలో గుస్సాడీ దర్బార్‌

 దండేపల్లిలో గుస్సాడీ దర్బార్‌

దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి ఒడ్డున ఉన్న పద్మల్‌పురి కాకో ఆలయంలో గురువారం గుస్సాడీ దర్బార్‌ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ర్టాల నుంచి గోండ్‌, ప్రధాన్‌, కోలం, తోటి తెగలకు చెందిన ఆదివాసులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. గోదావరి నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో ఆలయంలో పూజలు చేశారు. కానుగ నూనెలో తయారుచేసిన గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. 

కొత్తగా పెళ్లయిన జంటలకు అమ్మవారి ఎదుట భేటీ ఉంచారు. కొత్త కోడళ్లను అమ్మవారికి పరిచయం చేయించారు. సామూహిక భోజనాలు చేశారు. దండారీ, గుస్సాడీ కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.