ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 19:49:31

స్టేషనరీ వస్తువులతో కలెక్టర్‌కు న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌

స్టేషనరీ వస్తువులతో కలెక్టర్‌కు న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌

ఆదిలాబాద్‌ : సందర్భం ఏదైనా సరే అవతలి వ్యక్తులను పూల బొకేలతో విష్‌ చేయడం అనవాయితీ వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం శుభాకాంక్షలు తెలిసేందుకే అంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసే ఆ పూల బొకేల ప్రయోజనం ఎంత మేరకు అని యోచించారు ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారికి ఆమె ఓ నూతన పిలుపునిచ్చారు. తనను విష్‌ చేసేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే స్టేషనరీ వస్తువులు తీసుకురావాల్సిందిగా పిలుపునిచ్చారు.

ఈ సమాజిక పిలుపునకు వివిధ ప్రభుత్వ విభాగాలు, వివిధ సంస్థల ఉద్యోగులు, లాయర్లు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు పెద్ద ఎత్తున స్పందించారు. పెన్నులు, పుస్తకాలతో పాటు ఇతర స్టేషనరీ వస్తువులను కలెక్టర్‌కు అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమను భాగస్వాములను చేసినందుకుగాను వీరంతా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీరు అందజేసిన పెన్నులు, నోట్‌బుక్స్‌, పెన్సిల్స్‌, ఎగ్జామ్‌ ప్యాడ్స్‌ను జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందజేయనున్నట్లు వెల్లడించారు.

తన పిలుపుకు స్పందించి ఊదార స్వభావంతో ముందుకు వచ్చిన దాతలందరికీ కలెక్టర్‌ ధన్యవాదాలు తెలిపారు. చిన్న చిన్న సహాయాలే అవసరార్థులకు పెద్ద సహాయంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులంతా కలిసి రూ.21 వేలను జమ చేసి కలెక్టర్‌కు అందజేశారు. భీంపూర్‌ మండలంలోని నిపని గ్రామంలో గల పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిందిగా కోరారు.


logo