శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:26:44

పాపలేని లోకంలో నేనుండలేను!

పాపలేని లోకంలో నేనుండలేను!

  • రైలుకింద పడి ఆద్య తండ్రి కల్యాణ్‌ ఆత్మహత్య
  • పదిరోజుల వ్యవధిలో రెండు విషాద ఘటనలు
  • తల్లి ఫేస్‌బుక్‌ పరిచయం, పర్యవసనాలకు ఇద్దరు బలి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/భువనగిరి: ప్రేమించి పెండ్లి చేసుకు న్న భార్యతో మనస్పర్థలు, ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించిన బిడ్డ లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేక.. చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపలేని లోకంలో తానుండలేనంటూ ప్రాణాలొదిలాడు. తల్లి ఫేస్‌బుక్‌ స్నే హాల కారణంగా, వాటితో ఎలాంటి సంబంధంలేని కుమార్తె హత్యకు గురికాగా, పదిరోజుల వ్యవధిలోనే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 2న ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐదేండ్ల ఆద్య దారుణ హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. భువనగిరి జిల్లాకేంద్రంలోని కిసాన్‌నగర్‌కు చెందిన సూరనేని కల్యాణ్‌రావు(37) ఆత్మకూర్‌(ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్‌ఖాన్‌గూడలోని విహారిహోమ్స్‌లో నివాసముంటున్నారు. 2011లో ఏపీలోని అనంతపురానికి చెందిన అనూషను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వీరికి 2015 లో ఆద్య పుట్టింది. ఆ తర్వాత అనూషకు ఫేసుబుక్‌ ద్వారా హైదరాబాద్‌కు చెందిన కరుణాకర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన రాజశేఖర్‌ పరిచయమయ్యారు. ఇటీవల అనూష..కరుణాకర్‌ను దూరంపెట్టి రాజశేఖర్‌తో సన్నిహితంగా ఉంటున్నది. దీన్ని జీర్ణించుకోలేని కరుణాకర్‌ కోపంతో ఈ నెల 2న రాజశేఖర్‌ను చంపేందుకు అనూష ఇంటికి వెళ్లాడు. అనూష.. రాజశేఖర్‌ను కాపాడేందుకు యత్నించగా కరుణాకర్‌ ఆగ్రహంతో ఆద్యను హత్యచేసి తాను గొంతు కోసుకున్నాడు.  

భార్యను బస్సు ఎక్కించి.. రైలు పట్టాలపైకి

ఆద్య హత్య, ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలతో కల్యాణ్‌ కుటుంబంలో మనస్పర్థాలు వచ్చాయని సమాచారం. అనంతపురంలోని ఇంటికి వెళ్లాలని, కుటుంబంలో గొడవలు సద్దుమణిగిన తర్వాత తీసుకువెళ్తానని కల్యాణ్‌ శనివారం అనూషను భువనగిరిలో బస్సుఎక్కించాడు. అనంతరం నేరుగా భువనగిరి రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.


logo