బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:55

సైబ్‌హర్‌ ఫ్యాక్ట్‌ ఫ్రైడే

సైబ్‌హర్‌ ఫ్యాక్ట్‌ ఫ్రైడే

  • సూచనలు చేసిన సైబర్‌ నిపుణులు
  • నమస్తే తెలంగాణతో ఏడీజీ స్వాతిలక్రా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సైబ్‌హర్‌ కార్యక్రమంలో శుక్రవారం ‘ఫ్యాక్ట్‌ ఫ్రైడే’ను నిర్వహించారు. ఆన్‌లైన్‌ వినియోగిస్తున్న చిన్నారులు ఎన్ని విధాలుగా సైబర్‌ ముప్పులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదనే అంశాలపై సైబర్‌ నిపుణులు సూచనలు చేశారు. చిన్నారులను ట్రాప్‌ చేసేందుకు వాడే పద్ధతులను, మహిళలు, యువతులనుంచి వారి వ్యక్తిగత ఏకాంత ఫొటోలను సేకరించి వాటిద్వారా చేసే బెదిరింపుల గురించి వివరించారు. లైంగిక వేధింపులు, యువతలను గురించి పుకార్లను వ్యాప్తిచేస్తామని బెదిరింపులకు పాల్పడే సైబర్‌బుల్లింగ్‌ వంటి ప్రమాదాలపై చర్చించారు.

గ్రామీణప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

స్మార్ట్‌ఫోన్లు, మొబైల్‌ డాటా అందుబాటులోకి వచ్చి నగర, పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణప్రాంతాల్లోనూ స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిందని అడిషనల్‌ డీజీ, రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఇంచార్జి స్వాతిలక్రా ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. మహిళలు, చిన్నారుల్లో సైబర్‌ నేరాలపై, వేధింపులపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. సైబర్‌ నేరాలబారిన పడిన తర్వాత కేసులు నమోదు చేసేకంటే.. ముందే అవగాహనతో ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆన్‌లైన్‌లో సైబ్‌హర్‌ కార్యక్రమాన్ని రూపొందించామని పేర్కొన్నారు. సైబ్‌హర్‌లో నెలపాటు ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందిస్తారు. వీటిని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి పర్యవేక్షిస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఇచ్చే సలహాలు, పలురంగాల సెలబ్రిటీలు ఇచ్చే సూచనలు, అవగాహన పెంచే క్విజ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. వీటిని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌, యూట్యూబ్‌, రేడియో, టీవీ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటివరకు నగర ప్రాంతాల్లోని విద్యార్థులు, చిన్నారులు, మహిళలే సైబ్‌హర్‌లో పాల్గొంటున్నారు. సైబర్‌ నిపుణుల సలహాలు, సూచనలు, క్విజ్‌ పోటీలు ఎక్కువగా ఇంగ్లిష్‌లో ఉంటున్నాయి. వీటిని తెలుగులోకి తర్జుమా చేసి సమాచారాన్ని వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాలకూ చేరవేయాలన్న యోచనలో ఉన్నామని స్వాతిలక్రా తెలిపారు. 


logo