సీఎస్ఐఆర్-ఐఐసీటీ సహకారంతో వృద్ధి
మూడు దిగ్గజ ఔషధ సంస్థలతో ఒప్పందం
ప్రభుత్వ సంస్థల నుంచి ముడి పదార్థాలు
ఆర్థిక సహకారం ఔషధ కంపెనీలది
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కొవాగ్జిన్ టీకాను అభివృద్ధిచేసిన భారతీయ సంస్థలు మరోసారి చేతులు కలిపాయి. మనుషులు, జంతువుల ఆరోగ్య సంరక్షణ కోసం చౌకగా టీకాలు తయారు చేసేందుకు, చికిత్సా విధానాన్ని రూపొందించేందుకుగాను ఓ వినూత్న పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్, బయోవెట్, సాపిజెన్ బయోలాజిక్స్కు.. ప్రభుత్వరంగ సంస్థలైన సీఎస్ఐఆర్-ఐఐసీటీకి మధ్య పరస్పర సహకార పరిశోధన ఒప్పందం కుదిరింది.
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సీ మాండే, ఐఐసీటీ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం కింద పరస్పరం ఆసక్తిదాయకమైన ప్రాజెక్టులను ఔషధ తయారీ సంస్థలు గుర్తిస్తాయని సీఎస్ఐఆర్-ఐఐసీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఔషధ తయారీ సంస్థలు వాటికి అవసరమైన ముడి పదార్థాలను అభివృద్ధి చేయడానికి సీఎస్ఐఆర్-ఐఐసీటీకి ఆర్థిక సహాయాన్ని అందించనున్నాయి. అంతేకాకుండా వినూత్న చికిత్సా విధానాలను రూపొందించేందుకు, సమర్థమైన వ్యాక్సిన్లను తయారు చేసేందుకు ‘ఇన్-విట్రో, ఇన్-వివో’ అధ్యయనాలను చేపట్టనున్నాయి. కొవాగ్జిన్ టీకాల తయారీ కోసం భారత్ బయోటెక్ సంస్థకు సింథెటిక్ ప్రాసెస్‌లో ఒక సహాయ అణువు ‘టీఎల్ఆర్7/8’ను సీఎస్ఐఆర్-ఐఐసీటీ గత నెలలో అందించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా సీఎస్ఐఆర్ డీజీ డాక్టర్ శేఖర్ మాండే మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మధ్య కుదిరిన ఈ ఒప్పందం వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు అవసరమైన సహకారాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. కొవాగ్జిన్‌తో భారత్ బయోటెక్ ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేసిందని కొనియాడారు. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అనేక వ్యాధులను నయం చేసేందుకు, భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. కొవాగ్జిన్ తయారీలో ఐఐసీటీ అందించిన సహకారం ఎనలేనిదని ప్రశంసించారు వ్యాక్సిన్ల తయారీ కంపెనీలను రసాయనిక కారకాలు, ముడి పదార్థాల కొరత ఎంతోకాలంగా వేధిస్తున్నదన్నారు. రానున్న రోజుల్లో ఆ సమస్యను అధిగమించేందుకు సీఎస్ఆర్-ఐఐసీటీ తమకు సహకరిస్తుందని చెప్పారు. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్, బయోవిట్ డైరెక్టర్ జలాచారీ, సాపిజెన్ బయోలాజిక్స్ డైరెక్టర్ డాక్టర్ రేచెస్ ఎల్లా, సీఎస్ఐఆర్, ఐఐసీటీ డాక్టర్ సీ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.