శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 23, 2020 , 02:27:24

పంటకు అదనపు ఆదాయం జోడించాలి

పంటకు అదనపు ఆదాయం జోడించాలి

  • అగ్రి బిజినెస్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌, ఆగ్రోఇండస్ట్రీ పెరుగాలి
  • వ్యవసాయాధారిత పరిశ్రమలకు ముడిసరుకు
  • రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు
  • వానకాలం నుంచి సాగులో సంస్కరణలశకం
  • ప్రపంచంతో పోటీపడేలా పంటలు పండించాలి
  • సేద్యంలో పరిణతికి స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు
  • వ్యవసాయంలో మార్పులపై భేటీలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పండిన పంటను నేరుగా మార్కెట్లో అమ్మకుండా.. దానికి వాల్యూ యాడ్‌ చేయడం (అదనపు విలువ జోడించడం) వల్ల అధిక ఆదాయం పొందుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పెద్దఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు ఏర్పాటుచేస్తున్నదని తెలిపారు. వచ్చే వానకాలం నుంచి సాగులో సంస్కరణలశకం మొదలవుతుందని, తెలంగాణ వ్యవసాయం రూపురేఖలే మారనున్నాయని చెప్పారు. ప్రజల అవసరాలు, మార్కెట్‌ డిమాండ్లకు అనుగుణంగా పంటల సాగు, అగ్రి బిజినెస్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌, ఆగ్రోఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారుచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో నిపుణులతో సమావేశమయ్యారు. పంటలసాగులో ఏరకమైన మార్పులు తీసుకొనిరావాలి? ఉత్పాదకత ఎలా పెంచాలి? రైతులు పండించిన పంటను యథావిధిగా మార్కెట్‌కు తరలించకుండా దానికి అదనపు విలువను జోడించడానికి ఇప్పుడున్న పద్ధతులేంటి? కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ప్రపంచం నుంచి పోటీ ని తట్టుకునేలా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు రావడానికి ఏం చేయాలి? ఎరువులు, రసాయనాల వాడకంలో రావాల్సిన మార్పులు ఏమి టి? పంటలో మిగులు ఉండకుండా ఏంచేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నిపుణులు పలురకాల సలహాలు, సూచనలు ఇచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని చర్చ లు జరిపి.. తెలంగాణ వ్యవసాయానికి దశ, దిశను నిర్దేశించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండేది. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలతో ఇప్పుడిప్పుడే రైతాంగంలో నమ్మకం ఏర్పడుతున్నది. ప్రభుత్వం ఏంచేసినా రైతుల శ్రేయస్సు కోసమే చేస్తుందనే విశ్వాసం ఉన్నది. సాగునీరు ఉన్నది. పెట్టుబడి ఉన్నది. ప్రభుత్వంపై నమ్మకం ఉన్నది. నైపుణ్యం కలిగిన రైతాం గం ఉన్నది. ఏ పంటైనా పండే నేలలు ఉన్నాయి. ఇన్ని సానుకూలతలున్న తెలంగాణలో అంతర్జాతీయస్థాయిలో వ్యవసాయం, అగ్రి బిజినెస్‌, అగ్రి ఇండస్ట్రీ అభివృద్ధి జరుగాలి. ఈ ఏడాది వానకాలం పంటతో వ్యవసాయంలో సంస్కరణల శకం ప్రారంభమవుతున్నది’ అని అన్నారు. ‘వ్యవసాయాభివృద్ధికి స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా రైతులకు కావాల్సినవి సమకూర్చుతున్నాం. పంటలు బాగా పండుతున్నాయి.. కనీస మద్దతు ధర వచ్చేలా చేస్తున్నం.. కానీ, ఇది సరిపోదు. ఇంకా వ్యవసాయాన్ని ముందుకుతీసుకెళ్లాలి. తెలంగాణ జీవికలో వ్యవసాయమే ప్రధానం. కాబట్టి ఎక్కువ దృష్టి దానిమీదనే పెట్టాలి. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శకం చేయాల్సి ఉన్నది’ అని ఆకాక్షించారు. సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌, మాజీఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, అగ్రి బిజినెస్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సీమా, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ఇండియా డైరెక్టర్‌ శ్రీనివాసాచారి, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ సలహాదారు గోపీనాథ్‌, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు  పాల్గొన్నారు.

నాణ్యమైన సరుకులతోబ్రాండ్‌ తెలంగాణ ఇమేజ్‌

  • రైతులు పండించిన పంటకు అదనపు విలువను జోడించాలి. ఇందుకోసం ప్రభుత్వం పెద్దఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు ఏర్పాటుచేస్తున్నది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కావాల్సిన ముడిసరుకును నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం కావాలి. నాణ్యమైన సరుకులు తయారుచేయడం వల్ల తెలంగాణబ్రాండ్‌కు ఓ ఇమేజ్‌ ఏర్పడుతుంది. అది అంతర్జాతీయంగా మార్కెటింగ్‌కు ఉపయోగపడుతుంది.
  • జనాభాలో ఎక్కువశాతం వ్యవసాయంలోనే ఉండడం ప్రగతికి సంకేతం కాదు. వ్యవసాయాధారిత పారిశ్రామికీకరణ జరిగితేనే అభివృద్ధి. వ్యవసాయాధారిత పారిశ్రామికీకరణకు తెలంగాణ ఎంతో అనుకూలం. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు పెద్దసంఖ్యలో వచ్చేలా కృషి జరుగాలి. దీనివల్ల అటు పారిశ్రామికరంగం, ఇటు సేవారంగాలు కూడా విస్తరిస్తాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏడాది పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా పంటలను మార్పుచేసుకోవాల్సి ఉంటుంది. పంటల మార్పిడి విధానం రాష్ట్రంలో రైతులకు అలవాటు కావాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. చీడపీడల వ్యాప్తి ఉండదు. దిగుబడి అధికంగా వస్తుంది. ఇవన్నీ రైతులకు విడమరిచి చెప్పాలి. 
  • ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంలో మార్పురావాలి. సరైన అవగాహన లేకపోవడంతో రైతులు వ్యాపారుల మాటనే నమ్మి వాటిని వాడుతున్నారు. ఎరువులు, పెస్టిసైడ్స్‌ను తగిన మోతాదులో వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించాలి. ఎరువులు ఎక్కువవాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉండదనే విషయం విడమరిచి చెప్పాలి. 
  • క్రాప్‌ కాలనీలు ఉన్నచోటే ఆ పంటకు సంబంధించిన అగ్రో ఇండస్ట్రీ/ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రావాలి.

క్లస్టర్లవారీగా పంటల నిర్ణయం

నియంత్రిత విధానంలో పంటల సాగుకోసం ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో క్లస్టర్లవారీగా వివరాలు సేకరించేందుకు వ్యవసాయవిస్తరణాధికారులు రంగంలోకి దిగారు. 1.3 కోట్ల ఎకరాల్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై వీరు నివేదిక తయారుచేయనున్నారు. సంబంధిత క్లస్టర్లలో గ్రామాలకు వెళ్లి రైతులు వేసే పంటలు, వేయాల్సిన వాటిపై సమాచారం తీసుకుని, జిల్లా వ్యవసాయ కార్డు ప్రణాళిక ప్రకారం సాగు వివరాలను జిల్లా వ్యవసాయశాఖకు నివేదిస్తారు. రాష్ట్రంలో 2,600 ఏఈవో క్లస్టర్లు ఉండ గా.. ఒక్కో క్లస్టర్‌లో 5 వేల ఎకరాలు  ఉన్నాయి. 

తెలంగాణ వ్యవసాయం పరిణతి సాధించాలి. ఇందుకోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అమలుచేస్తాం. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పంట ఉత్పత్తులు ఉండాలి. వేసిన పంటంతా అమ్ముడుపోయి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు నిరంతరం ముడిసరుకు అందాలి. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణలో పంటల సాగు జరుగాలి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


logo