శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:15:41

వ్యవసాయానికి అదనపు నిధులు

వ్యవసాయానికి అదనపు నిధులు

  • కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 
  • వ్యవసాయంపై కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ 
  • మౌలిక సదుపాయాల నిధి నుంచి రుణాలివ్వాలని వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వచర్యలతో తెలంగాణలో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయిందని, గతంతో పోల్చితే సాగువిస్తీర్ణం, ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ శుక్రవారం రా ష్ర్టాల వ్యవసాయశాఖమంత్రులతో నిర్వహించి న వీడియో కాన్ఫరెన్స్‌లో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టానికి అదనపు నిధులు ఇవ్వాలని, రాష్ట్రంలో ఇప్పటికే అమలుచేస్తున్న రైతుసంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సహాయాన్ని ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వాలని కోరా రు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి నుంచి సహకార, వ్యవసాయ, స్వయంశక్తి గ్రూపులతోపాటు ఆసక్తిగల రైతులకు వ్యక్తిగత రుణాలు అందించాలని విజ్ఞప్తిచేశారు. రాబో యే నాలుగేండ్లలో అన్ని రాష్ర్టాలకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి నుంచి వడ్డీరాయితీపై రూ.లక్ష కోట్లు రుణాలు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయం మంచిదని తెలిపారు. ఈ నిధులను రాష్ర్టాలకు గ్రాంటుగా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కుమ్రంభీంఆసిఫాబాద్‌, జయశంకర్‌భూపాలపల్లి, ఖమ్మం, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం కోరింది. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఒకటి లేదా రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయని, మొత్తం 501 సంఘాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 41.61 లక్షల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించామని చెప్పారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద లబ్ధిపొందుతున్న 36.79 లక్షల మంది రైతుల కన్నా ఇది అధికమని తెలిపారు. 

వరి ధాన్యంలో తెలంగాణ వాటా 56% 

రైతుబంధు ద్వారా సుమారు 57లక్షల మంది రైతులకు ఈ వానకాలంలో పెట్టుబడి కింద రూ. 7253 కోట్లను అందించినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర చర్యల ద్వారా తెలంగాణలో సాగునీటి వసతి పెరిగి సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని పేర్కొన్నారు. 2019-20లో ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన వరి ధాన్యంలో తెలంగాణ వాటా 56శాతమని గుర్తుచేశారు. తెలంగాణలో వ్యవసాయోత్పత్తులు భారీగా ఉంటాయని అంచనావేసిన సీఎం కేసీఆర్‌, ఐదేండ్లుగా గోదాముల నిర్మాణం చేపట్టారని తెలిపారు. 

కేంద్ర మార్కెటింగ్‌ ఆర్డినెన్స్‌తో నష్టం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మార్కెట్లపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రం లో అమలుచేయాలా? వద్దా? అనేదానిపై చర్చిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. న్యాయసలహా, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే ముందుకెళ్తామని స్పష్టంచేశారు. ఒప్పంద సేద్యం, మార్కెట్ల ఆర్డినెన్స్‌పై మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రతినిధులు అనిల్‌కుమార్‌, లక్ష్మీదేవితో మంత్రి శుక్రవారం సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం లో కేంద్ర ఆర్డినెన్స్‌ అమలుకు అనుమతులివ్వాలని కేంద్ర ప్రతినిధులు.. మంత్రిని కోరారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర నిర్ణ యం వల్ల స్థానిక మార్కెట్లు ఆర్థికంగా నష్టపోతాయని చెప్పారు. ఆర్థిక వనరులు పెంపొందించుకోవడానికి మద్దతు ధరకు కొనే పంటలను.. మార్కెట్‌యార్డుల్లో మార్కెట్‌ కమిటీలతో సేకరించేలా అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరారు. కోహెడ మార్కెట్‌ అభివృద్ధి పనులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి చర్చించారు. 


logo