గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:08:43

అదానీ కరెంట్‌ దేశానికి షాక్‌

అదానీ కరెంట్‌ దేశానికి షాక్‌

  • 8000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు అప్పగింత
  • పీపీఏ లేకుండానే కట్టబెట్టిన మోదీ సర్కారు
  • జనం సొమ్ములు దొడ్డిదారిన దోచిపెట్టే కుట్ర!
  • కొత్త విద్యుత్‌ చట్టానికి అనుగుణంగా కాంట్రాక్ట్‌
  • రాష్ర్టాల డిస్కంలపై పెనుభారం పడే అవకాశం
  • బ్యాక్‌డౌన్‌ ప్రమాదంలోకి రాష్ట్ర విద్యుత్‌కేంద్రాలు
  • కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకే కొత్త చట్టమా?
  • ఇదేనా కేంద్ర బీజేపీ సర్కారు పేదల పక్షపాతం?

అనగనగా ఓ రాజావారు.. ఆయనకో స్నేహితుడు. ఇద్దరూ ఒకరోజు చాయ్‌పే చర్చలో కూర్చున్నరు. నేను ఓ కరెంటు దుకాణం పెట్టుకొంటనని దోస్తు అడిగిండు. చిన్నదేం ఖర్మ పెద్దదే పెట్టుకో.. నేను పర్మిషన్‌ ఇస్తున్న గద.. అని రాజు అభయహస్తమిచ్చిండు. ఈ దోస్తేమో సంబురంగ పోయి ఓ పే..ద్ద కరెంటు తయారుచేసే దుకాణం పెట్టుకొన్నడు. కానీ.. కస్టమర్లు మాత్రం లేరు. దీంతో ఆ దోస్తు మళ్లీ రాజు దగ్గరకుపోయి మొరపెట్టుకొన్నడు. నీకెందుకు బెంగ.. కస్టమర్లను తెచ్చిచ్చే పూచీ నాది.. సుకూన్‌గా పోయి పండుకో అని పంపించిండు రాజు. తెల్లారేసరికి దేశమంతా కొత్త కరెంటు చట్టం చాటింపయింది. ఫలానాయిన దగ్గర కరెంటు కొనాల్సిందేనని లేకుంటే అంతే సంగతులని ఢంకా బజాయించిన్రు. జనం నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఆ రాజావారు మన ప్రధాని మోదీ.. ఆయన దోస్తు గౌతమ్‌ అదానీ. వీరిద్దరి మిలాఖతే ఈ కథ..

ఉత్తర భారతదేశంలో అక్కడి వ్యాపారులు పెట్టుబడిపెట్టి ఏర్పాటుచేసిన సౌరవిద్యుత్‌ ప్లాంట్‌లు చాలా ఉన్నాయి. అందులో అదానీ గ్రీన్‌ది అతి భారీ ప్రాజెక్టు. ఈ ప్లాంట్లనుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును కొనడానికి ఎవరూ రావడంలేదు. ఇప్పుడు ఆ విద్యుత్తును కేంద్రప్రభుత్వం అమ్మించే పనిలో పడింది. అది దేశంతో కొనిపించాలి. ఆ కొనిపించడానికి తెచ్చిందే కొత్త విద్యుత్‌ సవరణ చట్టం ముసాయిదా బిల్లు. దానికోసం రాష్ర్టాల విద్యుత్‌ సంస్థలకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. 19 శాతం పునరుత్పాదక ఇంధనాన్ని కొనకపోతే.. భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నది. తన పరమ మిత్రుడు గౌతమ్‌ అదానీ భారీ ప్రాజెక్టుకు దొడ్డిదారిన గ్యారంటీ కస్టమర్లను తెచ్చిపెట్టేందుకు.. ఈ చట్టానికి రూపకల్పనచేసింది. 

ఓ పక్క తెలంగాణ సర్కార్‌.. ప్రభుత్వరంగ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కోలను స్వయంసమృద్ధం చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇతర పీఎస్‌యూల మాదిరిగానే విద్యుత్‌ రంగాన్ని అడ్డికి పావుసేరు లెక్కన అదానీ వంటివాళ్లకు అమ్మేస్తున్నది. దీన్ని పేదలు, రైతుల పక్షపాత మంటారా? ఇది జేబుల్లోంచి ఉన్నదంతా గుంజుకొని అదానీ జేబులు నింపడం కాదా?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌సంస్థల జేబులు నింపేందుకే అధికారంలోకి వచ్చిందని మరోసారి రుజువైంది. ఇందుకోసం ఆ పార్టీ సర్కార్‌ శాయశక్తులా కృషి చేస్తున్నది. కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టడానికి అవసరమైతే చట్టాలనుకూడా తిరగరాసి వారికి అనుకూలంగా మలుస్తున్నది. పర్యావరణానికి మేలుచేస్తున్నామనే మిషతో.. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్‌ ఎనర్జీ) ఉత్పత్తికి కార్పొరేట్‌ సంస్థల ఆధ్వర్యంలో భారీగా ప్లాంట్లు పెట్టించి.. ప్రజాధనాన్ని దోచుకొనేందుకు పక్కాగా ప్రణాళిక రచించింది. 

8 వేల మెగావాట్ల ప్రాజెక్టు

తాజాగా గౌతమ్‌ అదానీ గ్రూప్‌ 8000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకొన్నది. సుమారు రూ.45,000 కోట్ల (6 బిలియన్‌ డాలర్లు) వ్యయంతో ఈ 8 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ ఇచ్చేసింది. ఇంత పెద్దమొత్తంలో విద్యుత్‌ కొనుగోలుకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే.. భారీ ప్రాజెక్టును అప్పగించడం మహామహులను సైతం ఆశ్చర్యపరిచింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు ఏ మేరకు అనుకూలంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. 

విద్యుత్‌ సవరణల చట్టం ఇందుకేనా? 

8 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును అదానీకి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర స్పష్టంగానే కనిపిస్తున్నది. తాజాగా కేంద్రం సిద్ధంచేసిన విద్యుత్‌ సవరణల ముసాయిదా చట్టం-2020లో పేర్కొన్న అంశాల ప్రకారం నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ ప్రకారం దేశ వ్యాప్తంగా రెన్యూవబుల్‌ ఎనర్జీని రాష్ర్టాల్లోని డిస్కంలు తప్పనిసరిగా నిర్దిష్టమైన శాతంలో వాడాలని నిర్ణయించింది. రాష్ర్టాల్లోని విద్యుత్‌ నియంత్రణ మండలిని నియమించే అధికారం కేంద్రసంస్థ చేతిలోనే ఉంటుంది. దీంతో ఈ నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ ప్రకారం తప్పనిసరిగా నిర్దిష్టమైన శాతంలో రెన్యూవబుల్‌ఎనర్జీని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 

కొనకుంటే జరిమానాలే

రాష్ర్టాల్లో విద్యుత్‌ పంపిణీచేస్తున్న డిస్కంలు తాజాచట్టంలోని ఎన్‌ఆర్‌ఈపీ ప్రకారం సౌర విద్యుత్‌ను నిర్దేశించిన ప్రకారం కొనకుంటే జరిమానా కట్టాలనే నిబంధన ఉన్నది. ఈ నిబంధనలను అడ్డంగా పెట్టుకొని అదానీ కంపెనీకి అక్రమంగా లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు. చట్టం పేర్కొన్న ప్రకారం సౌర విద్యుత్‌ను రాష్ర్టాల్లోని డిస్కంలు కొంటే ఆ డబ్బులు అదానీకే చేరుతాయి.. లేకుంటే జరిమానాల రూపంలోనూ డిస్కంలు భారీగా నష్టపోతాయి. అదానీక కోస రాష్ర్టాల్లో చక్కగా నడుస్తున్న విద్యుత్‌ వ్యవస్థలను నిర్వీర్యంచేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది.

19 శాతానికి పెరుగనున్న రెన్యూవబుల్‌ ఎనర్జీ 

ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణమండలి నిర్ణయించిన ప్రకారం తెలంగాణ డిస్కంలు ఇప్పుడు 7 శాతం రెన్యూవబుల్‌ ఎనర్జీని ఉపయోగిస్తున్నాయి. అదే ఎన్‌ఆర్‌ఈపీ ప్రకారమైతే , 19 శాతానికి పెరుగుతుంది. అంటే ప్రస్తుతం వినియోగిస్తున్న రెన్యూవబుల్‌ ఎనర్జీకి రెండున్నర రెట్లు అధికంగా కచ్చితంగా వాడాల్సి వస్తుంది. ఇలా పెరిగిన మొత్తం విద్యుత్‌ను అదానీలాంటి బడా కార్పొరేట్‌ సంస్థల నుంచే కొనాల్సి ఉంటుంది. అంతిమంగా ప్రజలనెత్తి కొట్టడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానంగా మారింది.  

అదనంగా 8,200 మిలియన్‌ యూనిట్ల భారం

మన రాష్ట్రంలో పరిస్థితినే ఒకసారి అధ్యయనంచేద్దాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 68,601 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాం. తాజా విద్యుత్‌ సవరణల చట్టంలో పేర్కొన్న నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ ప్రకారం.. 7 శాతంగా ఉన్న పునరుత్పాదక ఇంధనవనరుల శాతం 19 శాతానికి పెరుగుతుంది. గతేడాది వినియోగాన్నే సగటుగా తీసుకుంటే.. 68,601 మిలియన్‌ యూనిట్లలో 7% అంటే.. 4,802 మిలియన్‌ యూనిట్లను ప్రస్తుతం వాడుతున్నాం. ఇదే ప్రస్తుత రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయించింది. కానీ ఈ అధికారం కేంద్రంచేతుల్లోకి వెళితే 19% (13,034 మిలియన్‌ యూనిట్లు) ఈ పునరుత్పాదక ఇంధన వనరులను వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్నదానితో పోల్చితే ఇది 8,200 మిలియన్‌ యూనిట్లకుపైగా ఉంటుంది. ఇంతగా పునరుత్పాదక ఇంధన వనరులను వాడాలంటే అదానీ ప్రాజెక్టు లాంటివాటి నుంచే తీసుకోవాల్సిందే. లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, అదనంగా నిర్దేశించిన 8,232 మిలియన్‌ యూనిట్ల రెన్యూవబుల్‌ ఎనర్జీని ఉపయోగించుకోకపోతే.. మొదటి సంవత్సరం యూనిట్‌కు 50 పైసల చొప్పున రూ.410 కోట్లు, రెండో ఏడాది రూ. 820 కోట్లు (యూనిట్‌కు రూపాయి చొప్పున), మూడో సంవత్సరం నుంచి ఏటా రూ.1,640 కోట్ల జరిమానాను మన డిస్కంలు కట్టాల్సి ఉంటుంది. పైపెచ్చు.. కాలం గడుస్తున్న కొద్దీ.. ఉపయోగించాల్సిన రెన్యూవబుల్‌ ఎనర్జీ శాతం పెంచడమే కానీ తగ్గించడం ఉండదు. అంటే జరిమానా కూడా అదే దామాషా ప్రకారం పెరుగుతుంది. 

తెలంగాణ డిస్కంలపై పిడుగు

ఒకవేళ ఈ చట్టం అమలైతే తెలంగాణలో విద్యుత్‌ను పంపిణీచేస్తున్న ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ సంస్థల మెడకు ఉచ్చు బిగుసుకొన్నట్టేనని విద్యుత్‌ నిపుణులు చెప్తున్నారు. వందల కోట్లరూపాయలను జరిమానా రూపంలో చెల్లించడమో.. లేక తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్‌విద్యుత్‌ కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ చేసుకోవడమో తప్పదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డిస్కంలను ముంచడం, కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టడమే ధ్యేయంగా కొత్త విద్యుత్‌చట్టంలో నిబంధనలు పొందుపర్చారని విమర్శిస్తున్నారు. 

నిబంధనలకు పాతర
అదానీ గ్రీన్‌ సంస్థ 8 వేల మెగావాట్ల బహుళ ప్లాంట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి     ప్రాజెక్టుకు 2019 జూన్‌లో టెండర్‌ వేసింది. ఈ ఏడాదే సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెసి) అనుమతి ఇచ్చింది. దేశంలో ప్రభుత్వ గ్యారంటీ ఉన్న పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ) లేకుండా చేసుకొన్న భారీ ప్రాజెక్టు ఒప్పందం ఇదే. అదానీ గ్రీన్‌ తొలి దశలో 2వేల మెగావాట్ల ప్లాంట్‌ 2022కు పూర్త వుతుంది. ఆ తర్వాత వరుసగా ఏడాదికి 2 వేల మెగావాట్ల చొప్పున 2025 నాటికి మొత్తం ప్రాజెక్టుపూర్తవుతుంది. కానీ ఈ మెగా ప్రాజెక్టు ప్రారంభమైందే కానీ.. దీనికి గ్యారంటీ కొనుగోలుదారులు ఇప్పటివరకూ ఎవరూ లేరు. మార్కెట్‌లో చార్జీలు పెరగడం, ఆర్థిక మాంద్యం.. అదానీ గ్రీన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నది. విదేశీబ్యాంకుల నుంచి అప్పులుతెచ్చుకొంటానని, పెట్టుబడిదారులు వస్తారని సంస్థ ప్రతి నిధులు చెప్తున్నప్పటికీ.. అది కష్టమేనని నిపుణులు అంటున్నారు. ఇందుకోసమే కేంద్రం విద్యుత్‌ చట్ట సవరణల బిల్లు తెచ్చిందని చెప్తున్నారు. 
అంబానీని దాటిన అదానీ లాభాలు
మీకు తెలుసా.. భారతదేశంలో ఈ ఏడాది అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్‌ అదానీ నిలిచారు. ఆసియాలోనే కుబేరుడు అయిన ముకేశ్‌ అంబానీని కూడా అదానీ మించిపోయారని బ్లూంబర్గ్‌ ఇండెక్స్‌ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఏడాది ముకేశ్‌ అంబానీ రూ.1.21 లక్షల కోట్ల ఆదాయ వృద్ధి పొందితే.. అదానీ సంపద ఈ ఏడాది 1.41 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం విధానాలు ఎవరికి మేలుచేస్తున్నాయో వేరే చెప్పాలా?   
2 వేల మెగావాట్ల వరకు బ్యాక్‌డౌన్‌ 
జరిమానాలను తప్పించుకోవాలంటే.. రెన్యూవబుల్‌ ఎనర్జీని ఉపయోగించుకోవాల్సిందే. బయటినుంచి రెన్యూవబుల్‌ ఎనర్జీని వాడుకోవాలంటే.. ప్రస్తుతం రాష్ట్ర జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్‌ కేంద్రాలను బలవంతంగా బ్యాక్‌డౌన్‌ చేసుకోవాల్సిందే. పైన చెప్పుకున్నదాని ప్రకారం మనం అదనంగా 8,232 మిలియన్‌ యూనిట్ల మేర రెన్యూవబుల్‌ ఎనర్జీని బయటినుంచి తెచ్చుకొని ఉపయోగించుకోవాలంటే.. మన దగ్గర జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను కనీసం 1,500 నుంచి 2,000 మెగావాట్ల వరకు బ్యాక్‌డౌన్‌ చేసుకోవాలి. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోసం అన్న చందంగా ఈ కొత్త చట్టాన్ని, అందులోని నిబంధనలను అడ్డుగా పెట్టుకుని ఇటు జెన్‌కో విద్యుత్‌ కేంద్రాలను మూసివేయడమో.. లేక డిస్కంలు భారీ మొత్తంలో జరిమానాలను చెల్లించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను చావుదెబ్బ తీసి.. అదానీ లాంటి కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టడమే దీని వెనుక లక్ష్యంగా కనపడుతున్నది.