ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తాను బతికానని హాస్యనటి అల్లరి సుభాషిణి పేర్కొన్నారు. తన క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సహాయం చేయాలని కోరిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి రూ.15 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. కష్టసమయంలో సహృదయంతో ఆదుకున్న దేవుడు కేసీఆర్ అని కొనియాడారు. జీవితాంతం ఆయన సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఇటీవల జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు హాజరైన ఆమె.. తన ప్రాణదాత సీఎం కేసీఆర్ అని చెప్పారు. ‘నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్‌కు ఆదుకోవాలని కేసీఆర్ సార్‌కు విజ్ఞప్తిచేశాను. ఐదు నిమిషాల్లోనే రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకున్న దేవుడు కేసీఆర్. ఆయన నిండునూరేళ్లు చల్లగా ఉండాలని నటరాజస్వామిని కోరుకుంటున్న. ఆయన కుటుంబం బాగుండాలి. జీవితాంతం ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయనను అలాగే చూడాలి. ఆయన మంచి భక్తుడు.. దేశాన్ని కాపాడే దేవుడు. ఆయన ఎంతోమందికి సహాయం చేశారు. మరెంతో మందికి సాయం అందించాలి. ఆయన పాదాలకు నమస్కారం’ అని భావోద్వేగానికి గురయ్యారు.