బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 01:32:17

మెగా బాధ్యత.. గ్రీన్‌ చాలెంజ్‌

మెగా బాధ్యత.. గ్రీన్‌ చాలెంజ్‌

  • అభిమానులకు సినీ నటుడు రాంచరణ్‌ పిలుపు 
  • ఎంపీ సంతోష్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు
  • కేదార్‌నాథ్‌లో మొక్క నాటిన యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మెగాస్టార్‌ అభిమానులు తీసుకోవాలని  సినీ నటుడు రాంచరణ్‌ పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌తో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ కొన్ని లక్షలమందిని కదిలించడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సినీ నటుడు ప్రభాస్‌ విసిరిన సవాల్‌ను ఆదివారం  రాంచరణ్‌ స్వీకరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం రాంచరణ్‌ మాట్లాడుతూ ఈ సీజన్‌లో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని మొదలుపెట్టిన తన స్నేహితుడు ప్రభాస్‌.. మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బృందం సభ్యులు గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటాలని సూచించారు. సహ నటుడు రాంచరణ్‌ తనను గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కి నామినేట్‌  చేయడంపై  బాలీవుడ్‌ నటి అలియాభట్‌  ట్విట్టర్‌లో స్పందించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కి నామినేట్‌ కావడం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా మణికొండలోని తన నివాసంలో నటి కావ్యరెడ్డి గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటారు. అనంతరం నటులు అమర్‌, కుషల్‌, చక్రిలను చాలెంజ్‌ విసిరారు. 

హిమాలయాలకు గ్రీన్‌ చాలెంజ్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఉన్నత శిఖరాలను చేరింది. చార్‌ధామ్‌ పర్యటనలో ఉన్న యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు ఆదివారం హిమాలయాల్లోని పవిత్రస్థలం కేదార్‌నాథ్‌ దేవాలయం చేరుకున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్ఫూర్తితో కేదార్‌నాథ్‌ దేవాలయం ప్రాంగణంలో బాల్సమ్‌ మొక్కను నాటారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్‌, ఆల్ఫా పటేల్‌, మృణాళిని, నితేష్‌ జైన్‌ పాల్గొన్నారు.