బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 12:00:37

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన ప్రకాశ్‌ రాజ్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన ప్రకాశ్‌ రాజ్‌

హైదరాబాద్‌: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జోరుగా ముందుకు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి చాలామంది ప్రముఖులు ముందుకువస్తున్నారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి విసిరిన చాలెంజ్‌ను నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్వీకరించారు. ఈరోజు ఉదయం షాద్‌నగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో తన కుమారునితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఇష్టమైన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను తనికెళ్ల భరణి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ఐదారేండ్లలోనే రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ మార్చారని తెలిపారు. ముఖ్యమంత్రికి ఉన్న విజనే దీనికి కారణమని చెప్పారు. 

సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌ మట్టి మనుషులని, వారికి మట్టితో అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. అందుకే మట్టికి చెట్టుకు ఉన్న అనుబంధంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశంసించారు. మొక్కలు పెంచే బాధ్యత మనందరిదని, ప్రభుత్వం చేస్తుందికదా అని మనం ఊరికే ఉండకూడదని సూచించారు. తెలంగాణ అంతటా పచ్చదనం పెరిగిపోయిందని. దీనికితోడు వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు అధికమై చెరువులు అలుగులు పోతున్నాయని చెప్పారు. దీనివల్ల సీఎం కేసీఆర్ విజన్ అయిన బంగారు తెలంగాణ సహకారం దగ్గర్లోనే ఉందని తెలిపారు. 

గ్రీన్‌ ఇండియా చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. తన మిత్రుడు మోహన్‌లాల్, తమిళ్ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. తన అభిమానులకు కూడా మొక్కలు నాటి, పది మందితో మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేశారు.


logo