శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:31:42

నర్సింగ్‌యాదవ్‌ కన్నుమూత

నర్సింగ్‌యాదవ్‌ కన్నుమూత

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (నమస్తే తెలంగాణ): ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హాస్యవిలన్‌ నర్సింగ్‌యాదవ్‌(52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌)తో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని యశోద దవాఖానకు డయాలసిస్‌ కోసం వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించింది. చికిత్స అందిస్తుండగా గురువారం రాత్రి మృతి చెందినట్టు దవాఖన వర్గాలు తెలిపాయి. నర్సింగ్‌యాదవ్‌కు భార్య చిత్ర, కుమారుడు రిత్విక్‌ ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు సుల్తాన్‌బజార్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. 

ఫైటర్‌ నర్సింగ్‌యాదవ్‌గా గుర్తింపు

నర్సింగ్‌ యాదవ్‌ పుట్టి పెరిగింది సుల్తాన్‌ బజార్‌లోని గుజరాత్‌గల్లీ.. కందస్వామి లేన్‌. సుల్తాన్‌ బజార్‌లో ఫైటర్‌ నర్సింగ్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. నర్సింగ్‌ యాదవ్‌ మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వగృహానికి తరలివచ్చారు. వీధిలో ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలుకరించే నర్సింగ్‌ యాదవ్‌ ఇక లేరన్న వార్తతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

‘హేమాహేమీలు’తో అరంగేట్రం

1990లో హేమాహేమీలు చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన ఆయన సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. సినీ రంగ ప్రవేశం చేసిన తొలినాళ్లలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నర్సింగ్‌యాదవ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. క్షణ క్షణం చిత్రంలో విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. అనంతరం మనీ, మాయలోడు, అల్లరిప్రేమికుడు, ముఠామేస్త్రీ, మాస్టర్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్‌, గాయం, పోకిరి, యమదొంగ, అన్నవరం, జానీ, ఠాగూర్‌, శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటించిన బాషా చిత్రంలోనూ ఆయన నటించారు. కమెడియన్‌, విలన్‌, క్యారెక్టర్‌ నటుడిగా విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు.