బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 02:55:05

ప్రజలు దిల్‌దార్‌.. ప్రతిపక్షాలకు తీన్మార్‌

ప్రజలు దిల్‌దార్‌.. ప్రతిపక్షాలకు తీన్మార్‌

  • గ్రామస్థాయి నుంచి కార్యాచరణ అమలుచేయాలి
  • రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గులాబీదే గెలుపు
  • ఓటర్ల నమోదుకు పార్టీ నాయకులు ప్రాధాన్యమివ్వాలి
  • నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జీలతో  టెలీకాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని.. ప్రతిపక్షాలే దివాళా తీశాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న రెండు శాసనమండలి పట్టభద్రుల స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జిలతో కేటీఆర్‌ గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు అందరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని.. అక్టోబర్‌ ఒకటినుంచి జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గాలవారీగా నియమించిన ఇంచార్జిలు తమ పనులు మొదలుపెట్టారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించిందని గుర్తుచేశారు. మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా రాష్ట్రప్రభుత్వం పాలనను ముందుకు తీసుకెళుతున్నదని అన్నారు. కొత్తగా రెవెన్యూచట్టం, టీఎస్‌ బీపాస్‌లాంటి అనేక చట్టాలతో పాలనా ఫలాలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో కీలకపాత్ర వహించే యువతకు టీఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఎజెండాయే దొరుకని పరిస్థితి ఉన్నదని చెప్పారు.

1.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ 

తెలంగాణ ఏర్పడిన నాటినుంచి లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ప్రైవేటురంగంలో దాదాపు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో పెద్దఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం ద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. నల్లగొండలో ఫ్లోరైడ్‌ రక్కసిని ఆరేండ్లలోనే తరిమికొట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని అన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని దేశం గర్వించేలా సీఎం కేసీఆర్‌ పునర్నిర్మిస్తునారని తెలిపారు. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుతోపాటు, పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌కు 60 లక్షల మంది కార్యకర్తల బలమున్నదని, వీరిలో అర్హతఉన్న ప్రతి ఒక్కరినీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ఓటరుగా నమోదు చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ తమ కుటుంబసభ్యులతోసహా ఓటరుగా నమోదు చేసుకోవాలని.. ఈ ప్రక్రియను తమ ఇండ్ల నుంచే ప్రారంభించాలని సూచించారు.


logo