బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 01:54:06

కాషాయ పార్టీలో కుమ్ములాట

కాషాయ పార్టీలో కుమ్ములాట

  • టికెట్లు ఇవ్వకపోవడంపై కార్యకర్తలు భగ్గు
  • అగ్రనేతల నిలదీత.. ఆందోళనలు 
  • మరో కార్యకర్త ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ ఎన్నికల వేళ కాషాయం పార్టీ ఆగం ఆగం అవుతున్నది. కాషాయ ముఖ్య నేతల తీరుపై కార్యకర్తల్లో ఆగ్ర హం కట్టలు తెంచుకుంటున్నది. పార్టీ కోసం  కష్టపడినవారి కంటే  వలసొచ్చిన  వారికే టికెట్లు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని కష్టపడినవారిని కాదని ఇతరులను అందలం ఎక్కిస్తున్నారనే మనస్తాపంతో గురువారం మరో కార్యకర్త  ఆత్మహత్యకు యత్నించారు. ఉప్పల్‌ నియోజకవర్గం నాచారం డివిజన్‌ నుంచి టికెట్‌ ఆశించిన అనుముల విజయలత అశ్వత్థామరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసి దవాఖాన పాలయ్యారు. పారీ కోసం అహర్నిశలు కష్టపడిన తనకు టికెట్‌ రాకుండా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కుట్ర చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించడం పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టించింది. పార్టీలోని  పెద్దలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అదనపు సంపాదనగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మంగళవారం నుంచే నాయకులను ఎక్కడికక్కడ నిలదీయడం మొదలైంది. కనిపించిన కమలనాథులను కార్యకర్తలు కడిగిపారేస్తున్నారు. మూడు రోజులుగా వరుస నిరసనలతో బీజేపీ కార్యాలయాలు సామాన్య కార్యకర్తల నిరసనలతో అట్టుడికిపోతున్నాయి. 

నేతలపై కార్యకర్తల ఆగ్రహం

టికెట్ల కేటాయింపుల్లో పార్టీ నేతలు, కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా సీనియర్‌ నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ వ్యవహారశైలి పట్ల కాషాయ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట గోషామహల్‌, జియాగూడ డివిజన్ల కార్యకర్తలు ఆందోళనకు దిగడం, బుధవారం ముషీరాబాద్‌లోని కే లక్ష్మణ్‌ కార్యాలయం ఎదుట అదే డివిజన్‌కు చెందిన కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నామినేషన్ల కు శుక్రవారం చివరి రోజైనప్పటికీ అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడంతో ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. 

అడ్డుపడుతున్న ఎన్వీఎస్‌ఎస్‌

‘మొదటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. 2016 లోనూ టికెట్‌ రాకుండా ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అడ్డుపడ్డారు. అప్పుడు ఎమ్మెల్యే సహకరించకున్నా సొంతంగా ఖర్చు పెట్టి పోరాడాను. ఇప్పుడు కూడా టికెట్‌ రాకుండా కుట్ర చేస్తున్నాడు’ అని అనుముల విజయలత అశ్వత్థామరెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. పార్టీ అభివృద్ధికి తన భర్తతో కలిసి ఎంతో కష్టపడి, ఆర్థికంగా కూడా నష్టపోయిన  తమకు పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.