శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 00:41:37

ఊరంతా ఒక్కటై..

ఊరంతా ఒక్కటై..

  • కరోనా కట్టడికి  చర్యలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పలు గ్రామాల ప్రజలు సమష్ఠిగా కృషిచేస్తున్నారు. తామే కాదు తమ ఊరు కూడా బాగుండాలని, ఊర్లో ఎవరూ ఈ వైరస్‌ బారిన పడకూడదని గ్రామాల పొలిమే రల్లో చెక్‌పోస్టులు పెట్టారు. ఒకరు రాళ్లు అడ్డం పెడితే, మరొకరు కంచె పాతారు. ‘వేరే గ్రామస్థులు మా ఊరికి రావొద్దు.. మేము వేరే ఊరికి వెళ్లం’ అంటూ స్పష్టంచేస్తున్నారు. 

గండికామారంలో..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గండికామారం గ్రామంలోకి నిత్యం భూపాలపల్లి నుంచి పదుల సంఖ్యలో పలువురు బైక్‌లపై వస్తుండటంతో.. సోమవారం స్థానికులు రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. అలాగే, గండికామారం వాసులు పక్క గ్రామాలకు వెళ్లకుండా కట్టడి చేశారు. గండికామారం గ్రామస్థులు చేసిన పనిని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, సోషల్‌ మీడియా ద్వారా అభినందిస్తున్నారు.

స్వచ్ఛంద మద్దతు..

లాక్‌డౌన్‌కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి ఎవరూ రావద్దంటూ ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చే రోడ్లను మూసివేశారు. తాము కూడా ఎక్కడికీ వెళ్లమని, ఇతరులు కూడా తమ గ్రామానికి రావద్దంటూ ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామ శివారులో స్థానికులు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్థులు కూడా బయటకు వెళ్లకుండా నిలిపివేస్తామని సర్పంచ్‌ కనక ప్రతిభ తెలిపారు. logo