శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 18:01:33

కరోనా వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

కరోనా వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలను చేపట్టినట్లు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ అమలు, కరోనా వైరస్‌ నివారణపై మంత్రి నేడు పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయన్నారు. కాగా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి విక్రయిస్తే 99890 71042, 91776 41042 నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సరుకుల రవాణాకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసు అధికారులు చూడాలన్నారు. 15 రోజులకు సరిపడా సరుకు నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విదేశాల నుండి వచ్చినవారు ఇండ్లలో ఉండకుండా బయట సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా కోవిడ్‌-19 తీవ్రతను గమనించి సామాజిక దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 


జిల్లావ్యాప్తంగా అనుమానితులను గుర్తించడానికి 389 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 148 మంది విదేశాల నుండి 249 మంది ఇతర రాష్ర్టాల నుండి వచ్చారన్నారు. వీరందరికి స్టాంపులు వేసి గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు వీరిని పర్యవేక్షించాలన్నారు. గ్రామస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడానికి 290 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రేషన్‌ బియ్యం పంపిణీకి పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100కు ఫోన్‌ చేసి తెలపాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, రామగుండం మేయర్‌ అనిల్‌, జిల్లా ఆరోగ్యశాఖాధికారి డా.పి.సుధాకర్‌, పౌరసరఫరాల అధికారి వెంకటేష్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



logo