బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 01:28:57

లాభసాటిసాగే మన లక్ష్యం

లాభసాటిసాగే మన లక్ష్యం

  • నియంత్రిత పంటలసాగుతోనే సాధ్యం
  • సంక్షేమం, అభివృద్ధి రెండుకండ్లు
  • హరితహారంలో భాగస్వాములు కావాలి
  • సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్‌ 

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే ప్రభుత్వం నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టిందని మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని.. ఇందుకోసం 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంగంపేటలో దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న 307 మంది రైతులకు 281 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలు పంపిణీచేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయంగా వచ్చే ప్రతి నీటిబొట్టునూ వ్యవసాయరంగానికి వినియోగిస్తామన్నారు. నీటిని కొనుక్కోవాల్సి వస్తుందన్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమయిందని, ఇష్టారీతిన చెట్లను నరికితే గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

ఆ దుస్థితిని రూపుమాపేందుకే గత ఆరేండ్లుగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  మొక్కలు నాటడమే కాదని.. వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనందరిపైనా ఉన్నదని సూచించారు. ఆరేండ్లలో రాష్ట్రం ఊహించనివిధంగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. అభివృద్ధి, సంక్షేమంలోనూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచామన్నారు. రంగంపేటలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అటవీభూములకు పరిష్కారం చూపినట్టు కేటీఆర్‌ తెలిపారు. పోడుభూములు సాగుచేసుకుంటున్న 307 మందికి 281 ఎకరాల భూమిపై యజమాన్యహక్కు కల్పించినట్టు వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జెడ్పీటీసీ గుగులోతు కళావతి తదితరులు పాల్గొన్నారు.

‘మమ్మల్ని సిరిసిల్ల జిల్లాలో కలపండి’మంత్రి కేటీఆర్‌కు నిజామాబాద్‌ జిల్లా తాటిపల్లివాసుల అభ్యర్థన


వీర్నపల్లి: ‘మమ్మల్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలపండి సార్‌' అంటూ నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి గ్రామస్తులు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్‌ వంతెన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం తమ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరం ఉండటంతో వివిధ పనుల కోసం వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. 40 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో తమ గ్రామాన్ని కోరారు.


logo