మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 17:24:07

బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలి.. ఎస్‌ఈసీకి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలి.. ఎస్‌ఈసీకి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌ : తమ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పట్ల అనుచితంగా మాట్లాడటం, అదేవిధంగా మత సామరస్యంతో ఉన్న హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతు టీఆర్‌ఎస్‌ పార్టీ నేడు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞాపన పత్రం అందజేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా బండి సంజయ్‌పై ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌ కుమార్‌ ఎస్‌ఈసీ కమిషనర్‌ పార్ధసారిథిని కలిశారు. ఈ సందర్భంగా సీఎంపై అదేవిధంగా నగరంలో మత సామరస్యానికి భంగం కలిగేలా బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ విజ్ఞాపనపత్రం అందజేశారు.

సీఎం కేసీఆర్‌ దేశ ద్రోహి, హిందూ వ్యతిరేకి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్ధం.. ఒసామాబిన్‌ లాడెన్‌, అఫ్జల్‌ గురు, యాకుబ్‌ మీనన్‌, ఔరంగజేబు, బాబర్‌, అక్బర్‌ వారసులు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీ నాయకులు, అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్నరంటూ బండి సంజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియా, టెలివిజన్‌ ఛానెల్స్‌లో ప్రసారం అయిన ఈ వాఖ్యల వీడియోలను టీఆర్‌ఎస్‌ నాయకులు ఆధారాలుగా ఎస్‌ఈసీకి అందజేశారు. 

సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు. బండి సంజయ్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఎన్నికల ప్రచారం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ అయిన సంజయ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్నారు. అవగాహన లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. చట్టం ప్రకారం ఎంపీ సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. చిల్లరగాళ్లను ఎంపీగా గెలిపిస్తే ఏమవుతుందో మనం చూస్తున్నామన్నారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బండి సంజయ్‌ మత సామరస్యంతో ఉన్న నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్నారు. ఒసామా బిన్‌ లాడెన్‌తో పోల్చడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ వాళ్లే ఉగ్రవాదులతో సంబంధం ఉన్న కశ్మీర్‌లోని పీడీపీతో కలిశారన్నారు. పాకిస్తాన్‌కు వెళ్లి జిన్నా విగ్రహానికి పూలదండ వేసి పొగిడింది బీజేపీ నాయకులేనన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే దేశ ద్రోహమా? చిల్లరమల్లర మాటలు మాట్లాడే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.