శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 02:56:32

స్థానిక అభ్యర్థులకు లెక్కల చిక్కులు

స్థానిక అభ్యర్థులకు లెక్కల చిక్కులు

  • ఎన్నికల వ్యయం చెప్పని 10,333 మందికి నోటీసులు!
  • చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • నోటీసులు అందుకోనున్నవారిలో గెలిచినవారు 1,148 
  • సహేతుకమైన సమాధానం రాకపోతే అనర్హత వేటు తప్పదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి వ్యయం వివరాలు అందజేయనివారికి షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయత్‌రాజ్‌శాఖకు సంబంధిత పత్రాలను పంపినట్టు సమాచారం. ఇందుకు 29 జిల్లాల్లో కసరత్తు ప్రారంభించిన ఈసీ.. ఇప్పటికే ములుగు, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో లెక్కలు చెప్పనివారి వివరాలు సేకరించింది. ఈ ఆరు జిల్లాల్లో  860 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 8,784 మంది వార్డు అభ్యర్థులు, 624 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, 65 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు.. మొత్తం 10,333 మంది ఉన్నట్టు గుర్తించింది. వీరిలో గెలిచిన సర్పంచ్‌లు ఏడుగురు, 1,138 మంది వార్డు సభ్యులు, ముగ్గురు ఎంపీటీసీలు ఉన్నారు. వీరందరిపై అనర్హత వేటుకు ప్రతిపాదించనున్నారు. ఓడిన అభ్యర్థులకేమో భవిష్యత్‌లో పోటీకి అనర్హులుగా ప్రకటించనున్నారు. మిగతా జిల్లాల్లోనూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం అశోక్‌ ‘నమసే తెలంగాణ’కు వివరించారు. ఎన్నికలకు ముందే ఈ నియమ నిబంధనలను అభ్యర్థులకు వివరించామని, అప్పుడే నియమాలు పాటించి ఉంటే.. ఇప్పుడీ సమస్య వచ్చేది కాదన్నారు. వీరందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు. సహేతుకమైన కారణాలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టంచేశారు.

సరైన కారణాలు చెప్పకుంటే వేటే

ఎన్నికల ఫలితాలు వెల్లడించిన 45 రోజుల్లోపే గెలిచిన వారే కాదు.. పోటీచేసిన అభ్యర్థులు కూడా వ్యయ వివరాలను ఈసీకి అం దించాలి. గడువులోపు ఇవ్వకుండా చర్యలు తప్పవని ఎన్నికల నియమావళి చెప్తున్నది. ఎన్నికల ప్రచారంలో ఖర్చుల వివరాలను తప్పనిసరి ఇవ్వాలి. ఇప్పటివరకు వివరాలు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సరైన కారణాలు లేకపోతే అనర్హలుగా ప్రకటించే అధికారం ఈసీకి ఉంటుంది. గెలిచిన వారుంటే అనర్హలు అవుతారు. ఓడిన అభ్యర్థులు నిర్దేశించిన గడువు వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా అధికారులు చర్యలు మొదలుపెడుతారు. ఇప్పుడు అనర్హత వేటు పడినా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా వీల్లేని పరిస్థితిపై ఆందోళన నెలకొన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికల ఖర్చులు లెక్కలు చెప్తామన్నా తిరిగి అర్హత సంపాదించే అవకాశం లేదు. అందుకే పోటీ సమయంలోనే ఎన్నికల నియమావళిని పూర్తిగా చదువుకోవాలని అధికారులు సూచిస్తారు.logo