శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:38

వికలాంగుల సంక్షేమానికి చట్టం

వికలాంగుల సంక్షేమానికి చట్టం

సామాజిక న్యాయ రంగంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలలో వికలాంగుల సంక్షేమం కోసం చేసిన చట్టం కూడా ఒకటి. దేశ నిర్మాణంలో వికలాంగులను కూడా భాగస్వాములను చేయడానికి పీవీ ప్రభుత్వం 1995లో ‘అంగవైకల్యం గల వ్యక్తుల (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తి భాగస్వామ్యం )చట్టం-1995’ ను తెచ్చింది. ఈ చట్టం 1996 ఫిబ్రవరి ఏడవ తేదీన అమలులోకి వచ్చింది. అంగవైకల్యాన్ని నిరోధించడంతో పాటు, వారి పునరావాసానికి తీసుకోవలసిన చర్యలను ఈ చట్టం నిర్దేశిస్తున్నది. విద్య, ఉద్యోగం, వృత్తి శిక్షణ, రిజర్వేషన్‌, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, అవరోధాల తొలగింపు, నిరుద్యోగ భృతి, ప్రత్యేక బీమా పథకం, ఆవాస వసతి కల్పన మొదలైన అంశాలలో వికలాంగులకు చేయూత ఇవ్వడానికి ఈ చట్టం రూపకల్పన జరిగింది. 


అంగ వైకల్యాన్ని నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలను చట్టం నిర్దేశించింది. అంగవైకల్యాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడానికి సర్వేలు జరపవలసి ఉంటుంది. అంగవైకల్యానికి కారణాలను గుర్తించి నిరోధించడానికి చర్యలు తీసుకునే విధంగా పరిశోధనలు జరపాలి. అంగవైకల్యాన్ని తొలిదశలో గుర్తించే కార్యక్రమంలో తోడ్పడటానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. గర్భస్థ దశ నుంచి ప్రసవం తరువాత వరకు తల్లి, శిశువు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమాచారం అందించాలి. 

విద్యారంగంలో తీసుకోవలసిన చర్యలను ఈ చట్టం నిర్దేశించింది. అంగవైకల్యం గల బాలలకు పద్దెనిమిది ఏండ్ల వయసు వరకు సమీకృత, ప్రత్యేక పాఠశాలల్లో ఉచిత విద్య పొందే హక్కు ఉంటుంది. ఈ విద్యార్థులకు తగిన రవాణా వసతి కల్పించాలి. వారు తిరగడానికి వీలుగా భవన నిర్మాణాలలో మార్పులు చేయాలి. పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాలి. స్కాలర్‌షిప్స్‌, యూనిఫామ్‌, అధ్యయన సామాగ్రి అందించాలి. వృత్తి శిక్షణ, అనియత బోధన అందించాలి. తమ పిల్లలకు సౌకర్యాల కల్పన కోసం తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉండాలి. 

ఉద్యోగాలలో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్‌ కల్పించాలి. వీరికి ఉపాధి కల్పన కోసం శిక్షణ ఇవ్వాలి. ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించాలి. వారికి తోడ్పాటు పరికరాలు అందించాలి. ఇల్లు, వ్యాపారం, వినోదం, ప్రత్యేక పాఠశాలలు, పరిశోధనలు, కర్మాగారాలలో వినోద కార్యక్రమాలు మొదలైన అవసరాల కోసం తక్కువ ధరకు భూమి కేటాయించాలి. రైలు, బస్సు, విమానం, పడవల వంటి రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలి. అంగవైకల్యాన్ని నిరోధించడానికి, వికలాంగులకు తగిన తోడ్పాటు పరికరాల తయారీకి పరిశోధనలను ప్రోత్సహించాలి. 

వికలాంగుల కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక చేయూతను ఇవ్వాలి. అంగవైకల్యం గల ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. వీరికి ప్రత్యేక ఉపాధి కల్పన కేంద్రం ఉండాలి. వికలాంగులకు సౌకర్యాలు లేనట్టయితే ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలి. ఈ చట్టానికి తరువాత కాలంలో సవరింపులు జరిగాయి. కొన్ని మార్పులు వికలాంగులకు అనుకూలమైనవి అయితే మరికొన్ని విమర్శలకు దారి తీశాయి. 

మనం ఏ రంగంలోనైనా ఎంత డబ్బయినా పెట్టవచ్చా అంటే అది సౌర శక్తిలోనే. పునరుత్పాదక ఇంధనాల్లో చేసే ఏ పరిశోధన అయినా మన దేశానికి వరం వంటిది. ఈ రంగంలో కృషి చేసే శాస్త్రవేత్తలకు నేను భవిష్యత్‌ తరాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. బొగ్గు వంటి ఇంధనాలు అంతరిస్తే, భవిష్యత్‌ తరాలకు ఏమీ మిగలదు. ఈ విషయంలోనే శాస్త్రవేత్తలు పురోగతి సాధించాలి. ఎనిమిదవ ప్రణాళికలో ఎక్కడైనా కోత పెట్టి ఆ మొత్తాన్ని ఇందుకు కేటాయిస్తాను.. నేను శాస్త్రవేత్తలకు చేయగలిగేది ఇదే. (1991 సెప్టెంబర్‌ 26న విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి స్వర్ణోత్సవాల ప్రారంభం సందర్భంగా పీవీ నరసింహారావు ఇచ్చిన ప్రసంగం)


logo