కబ్జా చెరవీడిన ప్రభుత్వ భూమి

- 30 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
- డీజీపీఎస్ సర్వేతో గుర్తింపు
హయత్నగర్: గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముతున్న రియల్టర్ల ఆటలను రెవెన్యూ అధికారులు కట్టించారు. డీజీపీఎస్ సర్వేతో సుమారు 30కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గుర్తించి చుట్టూ కంచె ఏర్పాటుచేశారు. హైదరాబాద్లోని హయత్నగర్ పరిధి అన్మగల్లోని సర్వేనంబర్ 191లో 1.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. డీఐతో సర్వే చేయించిన అధికారులు ఈ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటుచేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ విలువ భారీగా పెరగడంతో ఇంజాపూర్ గ్రామానికి వెళ్లే జెడ్పీ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ భూమిపై రియల్టర్లు కన్నేశారు. శ్రీలక్ష్మి రియల్ఎస్టేట్స్వారు ఈ భూమి నుంచి తమ వెంచర్లోకి రోడ్డును నిర్మించుకున్నారు. మరికొందరు ప్రైవేటు భూమి సర్వేనంబర్ను ఆధారం చేసుకుని ప్లాట్ల క్రయ విక్రయాలు చేపట్టి కోట్లు గడించారు. కరోనా నేపథ్యం, వరుసగా సెలవులు ఉన్న సమయంలో కబ్జాదారులు ఆ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేపట్టడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, హయత్నగర్ తాసిల్దార్ ప్రమీలారాణి సమక్షంలో డీఐ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో సోమవారం డిజిటల్ జియోగ్రాఫికల్ పొజిషన్ సిస్టమ్ (డీజీపీఎస్) సర్వేను చేపట్టారు. 191 సర్వేనంబర్ పాయింట్ హద్దులను నిర్ధారించారు. అనంతరం దగ్గరుండి కంచె ఏర్పాటుచేయించారు. ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను జేసీబీతో కూల్చివేయించారు. శ్రీలక్ష్మి రియల్ ఎస్టేట్ వెంచర్దారులు వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తాసిల్దార్ ప్రమీలారాణి తెలిపారు.