గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 11:32:22

ఏసీబీ క‌స్ట‌డీకి ఏసీపీ న‌ర్సింహారెడ్డి

ఏసీబీ క‌స్ట‌డీకి ఏసీపీ న‌ర్సింహారెడ్డి

హైద‌రాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ న‌ర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క‌స్ట‌డీకి ఏసీబీ కోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో.. న‌ర్సింహారెడ్డిని నాంప‌ల్లిలోని ఏసీబీ కార్యాల‌యానికి ఈ ఉద‌యం త‌ర‌లించారు.

మాదాపూర్‌ సైబర్‌ టవర్ల ఎదురుగా ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కొట్టేయడంలో మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి భారీ స్కెచ్ వేసిన‌ట్లు ఏసీబీ అధికారుల ద‌ర్యాప్తులో తేలిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న‌ను సుదీర్ఘంగా విచారించే అవ‌కాశం ఉంది. 

దాదాపు రూ.50 కోట్ల విలువచేసే 1,960 చదరపు గజాల భూమిని హాంఫట్‌ చేసిన విధానం షాక్‌కు గురిచేస్తున్నది. ఈ భూమిని ఇండ్ల స్థలాలుగా మార్చి కొట్టేయడంలో పాత్రధారులుగా ఉన్న 8 మందిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టుచేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని 1,960 చదరపు గజాల ప్రభుత్వభూమిని రిజిస్ట్రేషన్‌ చట్టం, 1980లోని సెక్షన్‌ 22-ఏ(1)(ఏ) కింద ఏపీఐఐసీ, హుడా, ఇతర ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమికి యజమానులుగా గోపగోని సజ్జన్‌గౌడ్‌, పోరెడ్డి తిరుపతిరెడ్డి, ఎర్ర చంద్రశేఖర్‌, అర్జుల జైపాల్‌ అలియాస్‌ గాలిరెడ్డి ఉన్నట్టు పత్రాలు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు. తర్వాత ఈ భూమిని వారివారి కొడుకుల పేరిట గిఫ్ట్‌డీడ్‌ కింద విక్రయించినట్టుగా 2016లో పత్రాలు పుట్టించారు. 2018లో అదే భూమిని ఏసీపీ నర్సింహారెడ్డి తన భార్య మంగతోపాటు మధుకర్‌ శ్రీరాం, బండి చంద్రారెడ్డి, బత్తిని రమేశ్‌, అలుగుబెల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరిట రిజిస్టర్‌ చేయించాడు. ఇందుకోసం ఒక్కో స్థలానికి రూ. 20 లక్షల చొప్పున రూ.80 లక్షలు చెల్లించినట్టుగా పత్రాలు సృష్టించారు.

ట్విస్టుల మీద ట్విస్టులు..

ఈ భూమి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.6 కోట్లు ఉంటుంది. దాన్ని వీళ్లు సృష్టించిన పత్రాల్లో రూ.4కోట్లుగా పేర్కొన్నారు. వాస్తవంగా ఈ భూమికి మార్కెట్‌ విలువ రూ.50 కోట్లు ఉంటుంది. అదీకాక, ఈ భూమి శేరిలింగంపల్లి మండలంలో ఉంటే ఎల్బీనగర్‌లో రిజిస్టర్‌ చేయడం ట్విస్ట్‌. రిజిస్ట్రేషన్‌ సమయంలో అమ్మిన నలుగురికి భూమి కొన్న నలుగురు సాక్ష్యులుగా సంతకాలు పెడితే, కొన్నవారికి ఆ అమ్మినవారే సాక్షి సంతకాలు పెట్టడం మరో ట్విస్ట్‌. ఇక, ఐదుగురు ఆ భూమి కొంటే డబ్బులు చెల్లించింది మాత్రం ఇద్దరే. ఒక్కొక్క ప్లాట్‌కి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.80 లక్షలకుగాను అలుగుబెల్లి శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి, ఏసీపీ భార్య మంగ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి జమచేయగా, మరికొంత నగదురూపంలో ఇచ్చినట్టు తెలిసింది. ఇద్దరు డబ్బులు చెల్లించిన భూమికి ఐదుగురు యజమానులుగా పత్రాల్లో ఉంది. ఇది అన్నింటికంటే పెద్ద ట్విస్ట్‌. అసలు ఈ రూ.80 లక్షలు నిజంగానే చెల్లించారా?. వారివారి మధ్య అకౌంట్లలో మారినట్టుగా సృష్టించారా? అన్నది ఇంకా సమాధానం దొరుకని ప్రశ్నే. సదరు భూమిలో ప్రస్తుతం ఈ ఐదుగురు చిన్న షెడ్లను నిర్మించి వారి స్థలంగా మార్చేసినట్టు అధికారులు గుర్తించారు. సదరు భూమికి సృష్టించిన కాగితాల్లోని సర్వేనంబర్లు సైతం ఫేక్‌ అని ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఉన్న ఎనిమిది మందితో ఏసీపీ నర్సింహారెడ్డికి సంబంధం ఏంటి? వీరంతా నర్సింహారెడ్డి బినామీలా? ఈ భూమితోపాటు ఇంకేవైనా భూముల అవకతవకల్లో ఈ ఎనిమిది మందికి సంబంధాలు ఉన్నాయా? అన్న విషయాలు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలే అవకాశం ఉన్నది.



logo