మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:28:45

వికసించిన విద్యుత్తేజం

వికసించిన విద్యుత్తేజం

  • అనేక అంశాల్లో రాష్ట్రం నంబర్‌ వన్‌
  • తలసరి వినియోగంలో మనమే టాప్‌
  • మన చొరవతోనే ఉత్తర, దక్షిణ కారిడార్‌
  • తెలంగాణ విద్యుత్‌ రంగ విజయాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దశాబ్దాలుగా కునారిల్లిన వ్యవస్థలో ఆరు నెలల్లోనే తొలి ఫలితం సాధించి.. ఆరేండ్లలో అద్భుతాలు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. లోటు కరెంటు.. గంటల తరబడి విద్యుత్‌ కోతలను అధిగమించి.. ఇప్పుడు తలసరి వాడకంలోనే జాతీయస్థాయిలోనే నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నది. అంతేకాదు.. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా వేగంగా అడుగులేస్తున్నది. రాష్ట్ర విద్యుత్‌ రంగం ఈ ఆరేండ్లలో సాధించిన విజయాలను విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీలో లఘు చర్చ సందర్భంగా వివరించారు.

ట్రాన్స్‌ఫర్మేషన్‌ వ్యవస్థలో అగ్రస్థానం

రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.28,000 కోట్ల పెట్టుబడితో విద్యుత్‌ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం బలోపేతం చేసింది. పవర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సామర్థ్యం 14,973 ఎంవీఏ నుండి 36,012 ఎంవీఏకు పెంచింది. ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థలో తెలంగాణది దేశంలోనే అగ్రస్థానం. రాష్ట్రం ఏర్పడేనాటికి.. 400కేవీ సబ్‌స్టేషన్లు 6 ఉంటే.. కొత్తగా 15  నిర్మించి, 21కి పెంచింది. 220కేవీ సబ్‌స్టేషన్లు 51 ఉంటే.. కొత్తగా 41 నిర్మించింది. దాంతో అవి 92కు పెరిగాయి. 33కేవీ సబ్‌స్టేషన్లు 2,178 ఉంటే.. ప్రస్తుతం 3,040కి పెరిగాయి. 3,272గా ఉన్న పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ 5,516కు చేరుకున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో కీలకమైన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ 4,61,000 నుండి 7,34,000కు పెరిగాయి. 99.90 శాతంతో తెలంగాణ ట్రాన్స్‌మిషన్‌ లభ్యత.. దేశ సగటు 97 శాతాన్ని అధిగమించింది. విద్యుత్‌ సరఫరా విషయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. నీతి ఆయోగ్‌ 2019-20 వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. తెలంగాణ చొరవతోనే పీజీసీఎల్‌ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్‌ లైన్ల నిర్మాణం జరిగింది. 4,500 మెగావాట్ల సామర్థ్యంతో వార్ధా- డిచ్‌పల్లి మధ్య 580 కిలోమీటర్ల మేర లైన్‌ నిర్మించారు. వడోదరా-వరంగల్‌ మధ్య 400 కిలోమీటర్ల మేర డబుల్‌ సర్క్యూట్‌ లైన్‌ నిర్మాణంలో ఉన్నది. దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ను ఇచ్చి పుచ్చుకోవడం ఈ లైన్ల ద్వారా సాధ్యమవుతుంది.

24 గంటల విద్యుత్‌తో సాగు సంబురం

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. దేశచరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని మొత్తం 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 2018 జనవరి 1 నుంచి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తున్నది. వ్యవసాయ, ఇతర సబ్సిడీల కోసం 2020-21లో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నది.

తలసరి వినియోగంలో నంబర్‌ వన్‌

ప్రగతి సూచికల్లో తలసరి విద్యుత్‌ వినియోగం అత్యంత ముఖ్యమైనది. తెలంగాణలో 2014-15లో తలసరి విద్యుత్‌ వాడకం 1,356 యూనిట్లు ఉంటే, 2019-20 నాటికి 2,071యూనిట్లకు చేరింది. ఇదే కాలంలో దేశ సగటు 1010 యూనిట్ల నుండి 1,208 యూనిట్లకు మాత్రమే పెరిగింది. 2019-20 సంవత్సరానికి కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ 9.22% వార్షిక వృద్ధిరేటు సాధించి, వెయ్యి మెగావాట్లకు పైగా విద్యుత్‌ వినియోగించే రాష్ర్టాలన్నింటిలో నంబర్‌వన్‌గా నిలిచింది.

సమైక్య రాష్ట్రం కన్నా ఎక్కువ డిమాండ్‌

సమైక్య రాష్ట్ర చరిత్రలో విద్యుత్‌కు అత్యధికంగా 2014, మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రంలో 2020 ఫిబ్రవరి 28న 13,168 మెగావాట్లుగా నమోదైంది. ఇది తెలంగాణలో పెరిగిన విద్యుత్‌ వినియోగానికి నిదర్శనం.logo