సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 18:39:51

హరిత లక్ష్యాన్ని చేరుకోవాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హరిత లక్ష్యాన్ని చేరుకోవాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేస్తూ..ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించి లక్ష్యం, సాధించిన ప్రగతిపై మంత్రి అర‌ణ్య భ‌వ‌న్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

జిల్లాల వారీగా టార్గెట్లు, సాధించిన ఫ‌లితాల‌ను మంత్రి విశ్లేషించారు. హ‌రిత‌హారం కార్యక్రమంలో మంచి ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయ‌ని, పచ్చదనం పెర‌గ‌డంతో అంద‌రూ హ‌ర్షిస్తున్నార‌న్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అధికారులంద‌రూ అంకిత‌భావంతో ప‌ని చేయాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..నిర్ధేశించిన 29.86 కోట్ల మొక్కలు నాటాల్సిన లక్ష్యానికిగాను ఇప్పటి వరకు 19.58 కోట్ల (65%) మొక్కలు నాటినట్టు తెలిపారు. 

ఆగ‌స్టు నెలాఖ‌రు క‌ల్లా ల‌క్ష్యాన్ని పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నాటే ప్రతి మొక్క ఎదిగే విధంగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, ఖ‌చ్చితంగా జియోట్యాగింగ్‌ పూర్తి చేయాల‌ని స్పష్టం చేశారు. రానున్న రెండేళ్ళ‌కు గాను  క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ప్లాన్ ను రూపొందించుకోవాల‌ని, న‌ర్స‌రీల్లో  ఎత్తైన మొక్క‌ల‌ను పెంచాల‌ని తెలిపారు. ప‌ల్లె వనాలు (యాదాద్రి మోడ‌ల్), స్మృతి వ‌నాలు ఏర్పాటు చేసుకోవాల‌న్నారు.  ప్రకృతి వ‌నాల ఏర్పాటు, నర్సరీల్లో మొక్కల పెంప‌కం మిగతా విభాగాల అధికారులు అట‌వీ శాఖతో స‌మన్వయం చేసుకోవాల‌ని సూచించారు.

పట్టణ ప్రాంతాల్లో కూడా పచ్చదనం పెంచాల‌న్న సీఎం కేసీఆర్  ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాల‌న్నారు. అదేవిధంగా నాటిన మొక్కల్లో 85% మొక్కలు బ‌త‌కాల్సిందేనని, దీనికి ఎలాంటి మినయింపులు లేవ‌ని స్పష్టం చేశారు. స‌మావేశంలో అట‌వీ శాఖ‌ స్పెషల్​ సీఎస్​ శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, పీసీసీఎఫ్  ఆర్.ఎం.డొబ్రియ‌ల్, అద‌న‌పు పీసీసీఎఫ్ లు చంద్రశేఖర్ రెడ్డి, సునీతా భ‌గ‌వ‌త్, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo