మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 03:35:25

భూముల లెక్క పక్కాగా..

భూముల లెక్క పక్కాగా..

 • పల్లెలు, పట్టణాల్లో మొదలైన నమోదు
 • పూర్తిచేసిన జాబితా పంచాయతీలో ప్రదర్శన
 • అభ్యంతరాలు వస్తే సరిచేశాకే అప్‌డేట్‌

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: తెలంగాణను భూ వివాదాల్లేని రాష్ట్రంగా మార్చే ప్రయత్నంలో మరో కీలక అడుగు పడింది. భూముల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ‘ఈ-అసెస్‌మెంట్‌' ద్వారా ఇంచు భూమిని కూడా వదలకుండా ఆన్‌లైన్‌లో చేరుస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టాన్ని పక్కాగా అమలుచేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో నమోదుకాని ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. గ్రామాల్లో దీనిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆస్తుల లెక్కలు కొలిచే పనిలో జిల్లా అధికారయంత్రాంగం నిమగ్నమైంది. మున్సిపాలిటీల్లో మంగళవారం నుంచి సర్వే చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇవన్నీ పూర్తిచేసిన తర్వాత లిస్టు ప్రింట్‌ తీసి, ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని సరిచేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌చేస్తారు. ప్రతి కట్టడం అసెస్‌మెంట్‌, ఆన్‌లైన్‌ ఎంట్రీ, అభ్యంతరాల స్వీకరణ, తుది (కరెక్ట్‌) జాబితా ప్రచురణ మొత్తం వచ్చే నెల 10 లోపు పూర్తిచేసేలా యంత్రాంగం పనిచేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో మూడు డివిజన్‌ కేంద్రాలతో పాటు 23 మండలాలు ఉన్నాయి. మొత్తం 499 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని ఆస్తుల లెక్కను పక్కాగా చేపడుతున్నారు. ప్రతీది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో 1,98,329 ఇండ్లు ఉండగా, వీటిలో 1,96,780 ఇండ్లు ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయి. వ్యవసాయ భూ ముల్లో నిర్మాణాలు జరిగిన వాటి వివరాలు సేకరిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లో మొత్తం 66,450 ఇండ్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా మరిన్ని ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. ‘ధరణి’ పోర్టల్‌లో రైతుల పట్టా వివరాలు, విరాసత్‌, కొత్త రిజిస్ట్రేషన్లు, కోర్టు ఆదేశాలు తదితర వంటివి ఉన్నవి. ప్రస్తుతం వీటితోపాటు ఇదివరకు నమోదుకాని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములను నమోదుచేస్తున్నారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యక్తిగత వివరా లతోపాటు ఇంటి యజమాని పేరు, ఆధార్‌కార్డు, చిరునామా, వృత్తి వివరాలు, ఇంటి వివరాలు, తదితర సమాచారం సేకరిస్తున్నా రు. పంచాయతీలు, పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉన్నది, ఏ స్థాయి లో ఇల్లు నిర్మాణం చేపట్టారు, ఎంత విస్తీర్ణంలో క ట్టారు, ఇల్లు పెంకుటిల్లా, డాబానా, ఇంటికి ఎంత ఖాళీ స్థలం ఉన్నది.. ఇలా ప్రతి ఇంచును లెక్కకట్టి ఆన్‌లైన్‌ చేస్తున్నారు. పట్టణాల్లో అయితే ప్లాట్‌ వి స్తీర్ణాన్ని కొలుస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ అయితే ఎన్ని అంతస్థులు ఉందన్న కొలతలు తీసుకుంటున్నారు.


లెక్క కడుతున్నారిలా..

 • ప్రతి గ్రామంలోని అన్ని కట్టడాలకు అసెస్‌మెంట్‌ చేసి ఆన్‌లైన్‌లో 2, 3 రోజుల్లో నమోదుచేస్తారు.
 • గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి ప్రభుత్వ కార్యాలయం, దాబాలు, హోటళ్లు, గుడులు, మసీదులు, చర్చిలు, సెగ్రిగేషన్‌ షెడ్‌, శ్మశాన వాటిక, వాటర్‌ ట్యాంకులు.. ఇలా ప్రతి కట్టడం ఆన్‌లైన్‌లో నమోదుచేస్తారు.
 • ప్రతి ఇంటి యజమాని మొబైల్‌ నంబరు, ఆధార్‌ నంబరు వివరాలు తెలియజేయాలి.
 • గ్రామంలోని మొదటి వార్డు నుంచి మొదలుపెట్టి చివరి వార్డు వరకు నమోదు కాని కట్టడాలను వెతికి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నారు.
 • వ్యవసాయ భూముల్లో కట్టుకున్న ఇండ్లను ఎంట్రీ చేస్తున్నారు. ఆ ఇండ్లకు కూడా నంబరు ఇచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
 • ఒకసారి ఆన్‌లైన్‌ ఎంట్రీ పూర్తయిన తదుపరి అన్ని కట్టడాల కొలతలు మరొక సారి సరిచూసుకుంటారు. 
 • ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత జాబితా ప్రింట్‌ తీసి, ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలు వస్తే వాటిని సరిచేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తారు.
 • మున్సిపల్‌ అడ్మినిస్ట్రేట్‌ (ధరణి) పోర్టల్‌లో 46 అంశాలతో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ వివరాలను సేకరించి ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు.
 • ఇంటి పన్ను రసీదు, కరెంట్‌ బిల్లు రసీదు, నీటి పన్ను రసీదులు, యజమాని ఫొటో, గుర్తింపు కార్డు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, పట్టాదారు పాసుబుక్‌ నంబర్‌, ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు, జాబ్‌కార్డు, ఆసరా పింఛన్‌, యజమాని ఆధార్‌కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్‌ నంబరు, కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్‌ నంబర్లు మొదలైన వివరాలు మీ వార్డులోకి వచ్చే మున్సిపల్‌ సిబ్బందికి తెలియజేయాలని మున్సిపల్‌ అధికారులు కోరుతున్నారు.


logo