సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:06:11

చిన్న పరికరం పెద్ద ఆయుధం

చిన్న పరికరం పెద్ద ఆయుధం

  • కరోనా గుర్తింపు, చికిత్సలో కీలకంగా పల్స్‌ ఆక్సీమీటర్‌  ఆక్సీజన్‌ స్థాయి తెలిపే సాధనం.. వాడటం సులభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శరీరంలోని ఆక్సిజన్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా కరోనా ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యం లో పల్స్‌ ఆక్సీమీటర్‌ అత్యంత కీలంగా మారింది. ఎవరైనా ఉపయోగించడానికి వీలుగా ఉండే ఈ చిన్న పరికరం కరోనాపై యుద్ధంలో, ప్రాణాలను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. కరోనా సోకి హోంక్వారంటైన్‌లో ఉన్నవారు ఎప్పటి కప్పుడు తమ రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఒకప్పుడు దవాఖానలకే పరిమితమైన ఇది ఇప్పుడు చాలామంది ఇండ్లల్లో కనిపిస్తున్నది. 

హైపోక్సియాను గుర్తిస్తుంది

కరోనా రోగుల్లో ఊపిరి అందకపోవడం అతిపెద్ద సమస్య. దీంతో రక్తంలోకి చేరే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడాన్ని ‘హైపోక్సియా’ అంటారు. కరోనా రోగుల్లో చాలామందికి లక్షణాలు బయటికి కనిపించడం లేదు (అసింమ్టమాటిక్‌). దీంతో వారికి ఆక్సిజన్‌స్థాయి పడిపోతున్న విషయం తెలియదు. ఫలితంగా ఒకటిరెండు రోజుల్లోనే పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నది. కరోనా మరణాల్లో సగంవరకు హైపోక్సియా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. హైపోక్సియాను వెంటనే గుర్తించి, దవాఖానకు వెళ్లగలిగితే ప్రాణాలు కాపాడుకోగలమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిందని భావించేవారు, హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందేవారు పల్స్‌ ఆక్సిమీటర్‌ తప్పనిసరిగా వినియోగించాలని సూచిస్తున్నారు.

పెరిగిన డిమాండ్‌.. తగ్గిన ధర

సాధారణంగా పల్స్‌ ఆక్సీమీటర్‌ ధర రూ.2 వేలకుపైగా ఉండేది. ప్రస్తుతం డిమాండ్‌ నేపథ్యంలో ఉత్పత్తి బాగా పెరిగింది. ఫలితంగా ధర దిగివచ్చింది. రూ.600 నుంచి రూ.1000 మధ్య లభిస్తున్నాయి.ఇలా పనిచేస్తుంది పల్స్‌ ఆక్సిమీటర్‌ను వినియోగించడం చాలా తేలిక. ఏదో ఒక చేతివేలి కొనకు ఈ మీటర్‌ను ఉంచి, బటన్‌ నొక్కితే చాలు ఆన్‌ అవుతుంది. కొన్ని సెకండ్ల తర్వాత డిస్‌ప్లేలో ఆక్సిజన్‌ శాతం, పల్స్‌రేటును చూపిస్తుంది. ఈ రీడింగ్‌ ఆధారంగా రోగులను వర్గీకరించి చికిత్స అందిస్తారు.

ఆక్సిజన్‌ స్థాయి ఎంత ఉండాలంటే..

రక్తంలో ఎంత మోతాదులో ఆక్సిజన్‌ సరఫరా అవుతున్నదో పల్స్‌ ఆక్సిమీటర్‌ గుర్తిస్తుంది. సాధారణంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ 95-100 శాతం వరకు ఉండాలి. పల్స్‌ రేటు 60-100 మధ్య ఉండాలి. ఆక్సిజన్‌ స్థాయి 90 శాతం కన్నా తక్కువకు పడిపోయినా, గుండె పల్స్‌ రేటు 100 కన్నా పెరిగినా రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు భావిస్తారు. కరోనా పాజిటివ్‌ ఉండి ఆక్సిజన్‌ లెవల్స్‌ 95, ఆ పైన ఉంటే తక్కువ లక్షణాలున్నట్టు భావిస్తారు. వీరిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందిస్తారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ 90-94 మధ్య ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు. వారిని దవాఖానకు తరలించాల్సి ఉంటుంది. 90 కన్నా తక్కువకు పడిపోతే.. వారిని క్రిటికల్‌ కేర్‌ దవాఖానకు తరలించాల్సి ఉంటుంది.


logo