మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 02:30:17

నెత్తురోడ్డుతున్న యువత

నెత్తురోడ్డుతున్న యువత
  • ప్రమాద మృతుల్లో 35 ఏండ్ల లోపువారే అధికం
  • మద్యం మత్తే ప్రధాన కారణం
  • ద్విచక్రవాహనాలతోనే ఎక్కువ యాక్సిడెంట్లు
  • 2018లో 1.51 లక్షల మంది మృతి
  • రోడ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అభివృద్ధిలో దేశానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన యువత రోడ్డు ప్రమాదాలకు బలవుతూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నది. మృతుల్లో 35 ఏండ్లలోపు యువతీ, యువకులే అత్యధికంగా ఉటున్నారు. వీరిలో ఎక్కువమంది పట్టపగలే మద్యం మత్తులో అదుపుతప్పి బైకులపై నుంచి కిందపడటం వల్లనే మరణిస్తున్నారు. 1970 నుంచి 2018 వరకు దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలను సమగ్రంగా పరిశీలించి కేంద్ర రోడ్డు భద్రతా సంస్థ విడుదలచేసిన నివేదికలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. 


1970లో దేశవ్యాప్తంగా జరిగిన 1.14 లక్షల ప్రమాదాల్లో దాదాపు 15 వేలమంది మృతిచెందగా 70 వేలమంది గాయపడ్డారు. ఈ సంఖ్యలు ఏటేటా పెరుగుతున్నాయి. 2018లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4.67 లక్షలకు, మృతుల సంఖ్య 1.51 లక్షలకు చేరింది. ఈ ప్రమాదాల్లో 67 శాతం ద్విచక్ర వాహనాల వల్లనే జరిగాయి. మొత్తం మృతుల్లో యువతీ, యువకులే 74 శాతం ఉన్నారు. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 35 ఏండ్లలోపు వయసున్న 69,851 మంది మృతిచెందగా.. ఈ సంఖ్య 2017లో 73,793కు, 2018 సంవత్సరంలో 72,757కు చేరింది. ప్రమాదాలు ఎక్కువగా వీధుల్లోనే జరుగుతున్నట్లు గుర్తించారు. 2018లో తెలంగాణలోని వీధిరోడ్లలో జరిగిన 14,238 ప్రమాదాల్లో 4,350 మంది చనిపోయారు. 


యువత ఎక్కువగా పగటి వేళల్లోనే ప్రమాదాలకు గురవుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది ద్విచక్రవాహనదారులే ఉంటున్నారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట జరిగిన 22,127 ప్రమాదాల్లో 6,571 మంది మృతిచెందారు. బైకులు అదుపుతప్పడం వల్ల జరిగిన 4,873 ప్రమాదాల్లో 961 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై సర్కస్‌ ఫీట్ల మాదిరిగా బైకులను నడిపిన ఘటనల్లో 226 ప్రమాదాలు జరుగగా.. 195 మంది యువకులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదాలు ఎక్కువగా టీ-జంక్షన్లలో జరుగుతున్నట్టు తేలింది. మన రాష్ట్రంలోని టీ-జంక్షన్లలో జరిగిన 3,635 ప్రమాదాల్లో 1,228 మంది,  వై-జంక్షన్లలో జరిగిన 1270 ప్రమాదాల్లో 361 మంది మృత్యువాతపడ్డారు.


దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మృతులు


వయస్సు
2016
2017
2018
18 ఏండ్లలోపు
10,622
9,408
9,977
18 నుంచి 25 ఏండ్లు
31,775
34,244
32,777
25 నుంచి 35 ఏండ్లు
38,076
39,549
39,960logo
>>>>>>