శనివారం 11 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 14:43:20

దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 12 మంది మృతి

దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 12 మంది మృతి

కృష్ణా : దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనన కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం వేదాద్రి వద్ద బుధవారం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ లారీ ఢీకొన్న ఘటనలో  ఇద్దరు చిన్నారులు , ఏడుగురు మహిళలు మృతి చెందారు. మృతులంతా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపువరం వాసులుగా గుర్తించారు. వీరంతా వేదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని తిరిగి ట్రాక్టర్‌లో స్వగ్రామానికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 26 మంది వరకు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో వేమిరెడ్డి పద్మావతి(45), గూడూరు సూర్యనారాయణరెడ్డి (46), లక్కిరెడ్డి అప్పమ్మ (45), లక్కిరెడ్డి తిరుపతమ్మ(60), గూడురు రమణమ్మ (45), వేమిరెడ్డి భారతమ్మ (70), వేమిరెడ్డి ఉదయ్‌ (6), పూడూరు ఉపేందర్‌రెడ్డి (15), రాజి ఉన్నారు. వీరితో పాటు మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలను జగ్గయ్యపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో ఎర్రుపాలం మండలంలో విషాదం నెలకొంది.

సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై పది మంది మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.


logo