బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 13:25:16

కీసర తహసీల్దార్‌ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

కీసర తహసీల్దార్‌ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

హైదరాబాద్‌ : భూముల వ్యవహారంలో రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. నాగరాజుతోపాటు రియల్టర్లు శ్రీనాథ్‌, అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌ను కూడా మూడురోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు అధికారులు నిందితులను చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను అవినీతి నిరోధశాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు. నిందితులందరినీ వేర్వేరుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. కీసర మండలంలోని దాదాపు 19 ఎకరాల భూమిని తహసీల్దార్‌ ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా మలిచేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు.

ఈ మేరకు తహసీల్దార్‌ నాగరాజు వెనుక ఇంకా ఎవరి హస్తం ఉందా? అనే కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే వ్యాపారులు రూ.1.10కోట్లు ఎక్కడి నుంచి సమీకరించారనే కోణంలోనూ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు రూ.2కోట్ల వరకు తహసీల్దార్‌, స్థిరాస్తి వ్యాపారుల మధ్య జరిగిందని, మొదటి రోజు రూ.1.10కోట్లు చెల్లించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కన రాంపల్లి పరిధిలో ఈ విలువైన భూమి ఉంది. దీనిపై న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా, అందులో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా సదరు భూమిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు కూడా తహసీల్దార్‌ నాగరాజు అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై మరింత లోతైన విచారణ జరిపేందుకు అధికారులు వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo