శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 02:38:10

నగేశ్‌పై ప్రశ్నల వర్షం!

నగేశ్‌పై ప్రశ్నల వర్షం!

  • దర్యాప్తులో వేగం పెంచిన ఏసీబీ
  • పక్కా ఆధారాలతో ముచ్చెమటలు 
  • మరో నలుగురు నిందితుల నుంచి కీలక సమాచారం సేకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అవును.. కాదు.. తెలియదు.. అంటూ విచారణకు సహకరించకుండా ఇబ్బంది పెట్టిన మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌పై ఏసీబీ అధికారులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఓ భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ. 1.12 కోట్లు డిమాండ్‌ చేసిన కేసులో అరెస్టయిన ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. రెండు రోజులుగా సరైన సమాధానం ఇవ్వకుండా సతాయిస్తుండటంతో ఏసీబీ అధికారులు సైతం రూటు మార్చినట్టు తెలిసింది. సాంకేతిక ఆధారాలు, ఈ సెటిల్‌మెంట్‌ కోసం బాధితుడితో నగేశ్‌ మాట్లాడినప్పటి నుంచి కాల్‌డాటాను ఆధారం చేసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలుస్తున్నది.

 రెండు దఫాలుగా రూ.40లక్షల లంచం తీసుకున్నట్టు ఇప్పటికే ఆధారాలు లభించటంతో ఆ సొమ్ము ఎక్కడ దాచారన్నదానిపైన మూడోరోజు విచారించారు. ఆ డబ్బు ఇచ్చిన సమయాలను బాధితుడి నుంచి సేకరించిన ఏసీబీ అధికారులు ఆయా తేదీల్లో, సమయాల్లో ఎవరెవరితో నగేశ్‌ ఫోన్‌లో మాట్లాడారన్న సమాచారం సేకరించినట్టు సమాచారం. డబ్బులు దాచే పనిని ఎవరెవరికి అప్పగించి ఉంటారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పక్కాగా ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తుండటంతో నగేశ్‌ కొన్నింటికి సమాధానా లు చెప్తున్నట్టు తెలిసింది. గతంలో భూ సెటిల్‌మెంట్లపైనా దర్యాప్తు చేసినట్టు తెలుస్తున్నది. 

నగేశ్‌ బినామీ జీవన్‌గౌడ్‌ పాత్రపైనా ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించారు. నమ్మకంగా ఉండటంతోనే భూసెటిల్‌మెంట్లకు సం బంధించి ఏ వ్యవహారమైనా నగేశ్‌ తనకే అప్పగించేవాడని జీవన్‌గౌడ్‌ చెప్పినట్టు సమాచారం. రూ.1.12 కోట్ల లంచానికి సంబంధించి సంప్రదింపుల్లో ఆర్డీవో అరుణారెడ్డి, తాసిల్దార్‌ సత్తార్‌లకు నేరుగా సంబంధం లేకున్నా వారు తీసుకున్న లంచం రూ.లక్షతోపాటు, గతంలో ఏవై నా ఇదే తరహా కేసుల్లో వీళ్లు నగేశ్‌ కు సహకరించారా? అన్న కోణంలోనూ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. జూనియర్‌ అసిస్టెంట్‌ వసీంతో నగేశ్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీల సంబంధాలపైనా కూపీ లాగుతున్నట్టు సమాచారం.