మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 02:41:32

ఏసీపీ అక్రమాస్తులు 70 కోట్లు

ఏసీపీ అక్రమాస్తులు 70 కోట్లు

 • ఏసీబీకి చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ
 • ఏకకాలంలో 25 చోట్ల సోదాలు
 • విలువైన భూమి, ప్లాట్ల పత్రాలు లభ్యం
 • బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
 • ఏపీ అనంతపురంలోనూ 55 ఎకరాలు
 • ఉప్పల్‌లో నర్సింహారెడ్డి అవినీతి ‘దర్బార్‌'

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మరో భారీ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. మొన్న కీసర తాసిల్దార్‌, నిన్న అదనపు కలెక్టర్‌ నగేశ్‌ లంచాల గురించి ఇంకా చర్చించుకుంటుండగానే అవినీతి అధికారుల జాబితాలో మరొకరు చేరారు. భూదందాలు, అక్రమ వ్యాపారాలతో కోట్లు కొల్లగొట్టిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి అవినీతి వ్యవహారం బయటపడింది. బుధవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని నర్సింహారెడ్డి ఇంటితోపాటు బంధువులు, బినామీల ఇండ్లు కలిపి ఏకకాలంలో 25 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు రూ.70 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు అధికారికంగా వెల్లడించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమార్జనపై సమాచారంమేరకు ఏసీబీ ప్రాథమిక ఆధారాలతో ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదుచేసింది. బుధవారం ఉదయం 5 గంటలకే రంగంలోకి దిగిన అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. ప్రస్తుతం నర్సింహారెడ్డి ఏసీబీ అదుపులోనే ఉన్నారు. గురువారం అరెస్టుచేసి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

రెండు రాష్ర్టాల్లో సోదాలు

మల్కాజిగిరి ఏసీబీ నర్సింహారెడ్డికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్రమాస్తులున్నట్టు తెలుస్తున్నది. ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్‌, కొంపల్లి, బాలానగర్‌, ఉప్పల్‌, అంబర్‌పేట, డీడీకాలనీల్లో సోదాలుచేశారు. మహేంద్రహిల్స్‌లోని నర్సింహారెడ్డి ఇంట్లో సోదాల సమయంలో ఏసీపీ నుంచి పలు వివరాలు సేకరించారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం వడిచర్లలో నర్సింహారెడ్డి అత్త్తగారి ఇల్లు, రఘునాథపల్లి మండలం కంచనపల్లి, బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్‌నగర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాల, కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లోని సన్నిహితుల ఇండ్లలోనూ సోదాలు చేశారు. వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోనూ ఏసీబీ ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించింది. ఇక్కడ నర్సింహారెడ్డి పేరిట 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించింది. గురువారం కూడా సోదాలు కొనసాగించే అవకాశం ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

బినామీలతో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌!

నర్సింహారెడ్డి ఉప్పల్‌లో సీఐగా పనిచేసిన సమయంలో స్థానికంగా ఎన్నో వివాదాలను సెటిల్‌చేసి అవినీతి సొమ్ము వెనకేసుకున్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నర్సింహారెడ్డికి బినామీగా అనుమానిస్తున్న పాటిల్‌ అనే వ్యక్తి ద్వారా ఉప్పల్‌లో ‘దర్బార్‌' పేరిట ఏకంగా ఓ బార్‌అండ్‌ రెస్టారెంట్‌ను పెట్టించినట్టు తెలుస్తున్నది. గతంలో హిమాయత్‌నగర్‌లోనూ ఓ డ్యాన్స్‌ బార్‌లో సైతం నర్సింహారెడ్డి బినామీలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వివాదాస్పద భూముల విషయంలో తలదూరుస్తూ సెటిల్‌మెంట్లలోనూ పలుకబడి ఉపయోగించి భారీగా డబ్బు సంపాదించినట్టు విమర్శలు ఉన్నాయి. ఉప్పల్‌ సీఐగా, చిక్కడపల్లి సీఐగా, ఎల్బీనగర్‌ ఏసీపీగా ఉన్నప్పుడు పలు వివాదాల్లో నర్సింహారెడ్డి పాత్ర ఉన్నట్టు ఏసీబీ ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. వీటన్నింటిపైనా లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. కాగా, నర్సింహారెడ్డి బినామీగా భావిస్తున్న పాటిల్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది.

ఇదీ ఆస్తుల చిట్టా 

ఏకకాలంలో 25 చోట్ల నిర్వహించిన సోదాల్లో ఏసీబీ అధికారులు పలు విలువైన ఆస్తులను గుర్తించారు. పట్టుబడిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.7.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

 • ఏపీ అనంతపురంలో 55 ఎకరాల పొలం
 • హైదరాబాద్‌లో సైబర్‌ టవర్ల ఎదుట 1,960 చదరపు గజాలు కలిగిన నాలుగు ఇంటి స్థలాలు
 • హఫీజ్‌పేటలో రెండు ఇండ్ల స్థలాలు, జీప్లస్‌ 3 వాణిజ్య భవనం
 • రెండు సొంత ఇండ్లు, రూ.15 లక్షల బ్యాంకు నిల్వ, రెండు బ్యాంకు లాకర్లు
 • రియల్‌ఎస్టేట్‌తోపాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు


logo