మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 01:53:48

రూ.48 కోట్ల భూమి ధారాదత్తం

రూ.48 కోట్ల భూమి ధారాదత్తం

  • వివాద భూమికి పాస్‌బుక్కులు
  • కీసర మాజీ తాసిల్దార్‌ మరో అక్రమం
  • క్రిమినల్‌ మిస్‌కండక్ట్‌ కింద ఏసీబీ కేసు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూ సెటిల్మెంట్‌లో రూ.కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి చిక్కిన కీసర మాజీ తాసిల్దార్‌ నాగరాజు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా.. వివాదంలో ఉన్న రూ.48 కోట్ల విలువైన ఓ భూమికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా పట్టా పాస్‌బుక్కులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు క్రిమినల్‌ మిస్‌కండక్ట్‌ కింద నాగరాజుపై శుక్రవారం మరో కేసు నమోదుచేసినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టం, మోసం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నకిలీ ధ్రువపత్రాలను వాస్తవమని చెప్పిన అభియోగాల కింద కేసులు నమోదుచేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కీసర మండలం రాంపల్లి దయారాలో వివిధ సర్వేనంబర్లలో 24 ఎకరాల 16 గుంటల స్థలానికి సంబంధించిన నకిలీ పత్రాలకు నాగరాజు వత్తాసు పలికాడు. వాటిద్వారా కందాడి లక్ష్మణ, కందాడి బుచ్చిరెడ్డి, కందాడి మీనమ్మ, కందాడి ధర్మారెడ్డికి ఈ ఏడాది జూలై 9న కొత్త పాస్‌బుక్కులను జారీచేశాడు. అప్పటికే ఈ భూ వ్యవహారం ఆర్డీవో వద్ద పెండింగ్‌లో ఉన్నది. అయినప్పటికీ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియకుండా నాగరాజు తన డిజిటల్‌ సంతకాన్ని దుర్వినియోగం చేసినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. నాగరాజు పాస్‌బుక్కులు ఇచ్చిన భూమి విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.48.8 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. logo