బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 01:43:40

ఆ 30 లక్షలు జీతం డబ్బులే!

ఆ 30 లక్షలు జీతం డబ్బులే!

  • ఏసీబీ విచారణలో తాసిల్దార్‌ సుజాత
  • ఓ స్థలం అమ్మితే వచ్చిన డబ్బు అన్న ఆమె భర్త
  • సుజాతపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు?
  • 14 రోజుల రిమాండ్‌కు ఆర్‌ఐ, ఎస్‌ఐ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘నాకు వచ్చిన జీతంలో ఖర్చులు పోను మిగతా డబ్బంతా ఇంట్లోనే దాచుకుంటాను. మీకు దొరికిన డబ్బు అదే’ ఏసీబీ ప్రశ్నలకు షేక్‌పేట్‌ తాసిల్దార్‌ సుజాత ఇచ్చిన సమాధానం ఇది. ‘ఓ స్థలం అమ్మడంతో ఆ డబ్బు వచ్చింది’ అదే డబ్బు గురించి సుజాత భర్త ఇచ్చిన సమాధానం ఇది. ఒకే డబ్బుకు సంబంధించి భార్యాభర్తలు వేర్వేరుగా సమాధానాలు ఇవ్వడంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. తాసిల్దార్‌ సుజాతపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. షేక్‌పేట్‌ రెవెన్యూ అధికారుల సెటిల్‌మెంట్‌ దందాపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

ఓ స్థల వివాదం విషయంలో రాజీకోసం షేక్‌పేట రెవెన్యూ అధికారులు శనివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆదివారం సుజాతను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు, శనివారం సోదాల్లో  పట్టుబడ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. రూ.30 లక్షలు తన జీతం డబ్బులని సుజాత సమాధానమిచ్చినట్టు తెలిసింది. అయితే ఎన్నేండ్లుగా జీతాన్ని ఇంట్లో దాచుకుంటున్న విషయం తనకు సరిగా గుర్తు లేదంటూ ఆమె పొంతలేని సమాధానాలు చెప్పుకొచ్చారు. 

ఇదే విషయంపై సుజాత భర్తను (ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు) ఆరా తీయగా స్థలాన్ని బంధువులకే విక్రయించినందున ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లేవని చెప్పుకొచ్చారు. విచారణ సందర్భంగా సుజాత ఇంట్లో స్వాధీనం చేసుకున్న పలు ప్రభుత్వ డాక్యుమెంట్లపైనా అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. అవసరం మేరకు మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పి సుజాతను ఏసీబీ అధికారులు పంపించారు. ఇక, ఇప్పటికే అరెస్టు అయిన ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, ఎస్సై రవీందర్‌ల నుంచి వివరాలు సేకరించి, కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరిని 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ నిమిత్తం ఆదివారం చంచల్‌గూడ జైలుకు పంపారు. 

వీఆర్వో పాత్రపై ఆరా

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని స్థల వివాదం వ్యవహారంలో ఆర్‌ఐ నాగార్జునరెడ్డితోపాటు షేక్‌పేట్‌ తాసిల్‌ కార్యాలయంలో ఇంకెవరెవరి పాత్ర ఉందన్నదానిపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఈ డీల్‌ కుదర్చడంలో కీలకంగా వ్యవహరించాడన్న సమాచారం మేరకు షేక్‌పేట వీఆర్వో శేఖర్‌ను కూడా ఏసీబీ అధికారులు ఆదివారం ప్రశ్నించారు. నాగార్జునరెడ్డి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌ నుంచి వివరాలు సేకరించారు. 


logo