గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 14:55:31

తిరుమ‌ల జ‌లాశ‌యాల్లో స‌మృద్ధిగా నీరు : ఏవీ ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల జ‌లాశ‌యాల్లో స‌మృద్ధిగా నీరు : ఏవీ ధ‌ర్మారెడ్డి

తిరుపతి : తిరుమలలోని జ‌లాశ‌యాల్లో రాబోవు 300 రోజుల వ‌ర‌కు పూర్తిస్థాయిలో భక్తులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని, టీటీడీ అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని పాపావినాశ‌నం జ‌‌లాశ‌యాన్ని ఇవాళ ఉదయం అద‌న‌పు ఈవో ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ.. సాధార‌ణంగా తిరుప‌తి, తిరుమ‌ల‌లో ఈశాన్య  రుతుప‌వ‌నాలతో అక్టోబ‌ర్, న‌వంబ‌‌ర్, డిసెంబ‌‌ర్ నెల‌లో విస్తా‌రంగా వ‌ర్షాలు కురుస్తాయ‌న్నారు. 


లోక క‌ల్యాణార్థం క‌రోనా వైర‌స్ నివారించ‌డానికి శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న నాద‌నీరాజ‌నం వేదికపై నెల రోజులకు పైగా నిర్వహిస్తున్న సుంద‌ర‌కాండ పారాయ‌ణంతో కార్యసిద్ధి క‌లుగుతుంద‌న్నారు. దాదాపు 15 రోజులుగా నిర్వహిస్తున్న ‌విరాట‌ప‌ర్వం పారాయ‌ణంతో వ‌ర్షాలు స‌మృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉంటుంద‌న్నారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ఈ  సంవత్సరం జూలైలోనే తిరుమ‌ల‌లో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయని, తిరుమ‌ల‌లోని డ్యాంలు 85 శాతం నిండినట్లు ఆయ‌న తెలిపారు.


 ఇందులో కుమారధారలో 98 శాతం‌, ప‌సుపుధారలో 95 శాతం, ఆకాశ‌గంగలో 30 శాతం, గోగ‌ర్భం డ్యాంలో 50 శాతం,  పాపావినాశ‌నం జ‌లాశయంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయ‌న్నారు. నీటి అవ‌స‌రాల‌కు పాపావినాశ‌నం డ్యాం నుండి  ప్రతి రోజు 30  లక్షల గ్యాల‌న్ల నీటిని పంపింగ్ చేయ‌వ‌ల‌సిందిగా అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు ఆయన తెలిపారు.  కార్యక్రమంలో టీటీడీ నీటి పారుద‌ల విభాగం ఈఈ శ్రీ‌హ‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
logo