శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 23, 2020 , 01:40:50

నియంత్రిత సాగుకు సంపూర్ణ మద్దతు

నియంత్రిత సాగుకు సంపూర్ణ మద్దతు

  • సీఎం మాటే మా బాట అంటూ ప్రతిజ్ఞలు
  • గ్రామాల్లో మూకుమ్మడిగా ఏకగ్రీవ తీర్మానాలు

గంగాధర/ చిగురుమామిడి / కోటపల్లి: సాగుకు సరిపోను నీళ్లు, 24 గంటల కరెం టు, పంట పెట్టుబడి, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేస్తున్న సర్కారు రైతుల మేలునే కోరుతుందని.. ఏ పంట వేయమం టే దానినే సాగుచేస్తామంటూ ఊరూరా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సర్కారు చెప్పిన సాగుబాటనే నడుస్తామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. వేసిన పంట మళ్లీ వేయబోమ ని.. సీఎం సారు చెప్పినట్టే ఆదాయం వచ్చే పంటలు మాత్రమే వేస్తామని రైతులు పేర్కొంటున్నారు. నియంత్రిత పంటల సాగు కు మూకుమ్మడిగా మద్దతు పెరుగుతున్నది. ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి(ఆర్‌), చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి రైతులు నియంత్రిత పంటల సాగుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మూసపద్ధతిలో కాకుండా.. డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసి రైతుల జేబులు సిరులతో నిండాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎటుచూసినా బీడువారిన భూములే కనిపించేవని.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులకు మంచిరోజులు వచ్చాయని తెలిపారు. రైతు సంక్షేమానికే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిందని, 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఎక్కడచూసినా నీళ్లు కనిపిస్తున్నాయని, పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గాగిరెడ్డిపల్లి సర్పంచ్‌ సన్నీల్ల వెంకటేశం మాట్లాడుతూ.. సీఎం సారు తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులంతా కట్టుబడి ఉంటామని, రైతు ల సంక్షేమమే ధ్యేయంగా అన్నివిధాలా సీఎం ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. వచ్చే వానకాలంలో వేరే పంటల జోలికి వెళ్లబోమని స్పష్టంచేశారు. రాపనపల్లిలో గ్రామసభ నిర్వహించారు. రైతుల బాగుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించిన పద్ధతిలోనే పంటలను సాగు చేయాలని సర్పంచ్‌ గుర్రం లక్ష్మి సూచించడంతో రైతులందరూ మద్దతు తెలిపారు. రైతుల సంక్షేమానికి కృషిచేస్తున్న కేసీఆర్‌ బాటలోనే తామంతా నడుస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.


logo