గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:35:58

రెవెన్యూ కోర్టులు రద్దు

రెవెన్యూ కోర్టులు రద్దు

  • ట్రిబ్యునళ్లకు పెండింగ్‌ కేసుల బదిలీ
  • వివాదాలుంటే సివిల్‌ కోర్టులకే
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ.. ఇకపై వివాదాల పరిష్కారానికి సివిల్‌ కోర్టుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. ‘తాసిల్దార్‌ ఆర్డర్‌ పాస్‌ చేస్తడు. ఆయన దగ్గరే కోర్టు ఉంటుంది. ఆయనే అధికారి, ఆయనే కోర్టు. ఆర్డీవోనే ఆర్డర్‌ పాస్‌చేస్తడు. మళ్లీ అయన దగ్గరే కోర్టు ఉంటుంది. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్డర్‌ పాస్‌చేస్తడు. ఆయన దగ్గర కోర్టు. ఇలా ఒక్క రెవెన్యూ శాఖలోనే మూడు కోర్టులు ఉంటాయి. ఇది వికారంగా ఉన్నది. ఆర్డర్‌ పాస్‌చేసేది అదే అధికారులు, జడ్జిగా ఉండేదీ అదే అధికారులు. కరెక్ట్‌ అనిపించడం లేదు. అధికారం ఉన్నది, చట్టం ఉన్నది, చట్టం పరిధిలో పనిచేయాలి. అక్కడికే అయిపోద్ది. తర్వాత సంగతి మనకెందుకు? తగువులుంటే కోర్టులు ఉన్నయి. న్యాయవిభాగం ఉన్నది. ఇన్ని అంచెల న్యాయవ్యవస్థ ఉండగా అనవసరంగా అందులో తలదూర్చడం ఎందుకు? చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వంద శాతం రెవెన్యూకోర్టులు ఉండవు. అన్ని కోర్టులు రద్దు అవుతాయి. 99.9% గొడవలు ఉండే అవకాశమే ఉండదు.

తెలంగాణ భూములకు డిమాండ్‌ 

సమైక్యవాదులు నాడు శాపాలు పెట్టారు. తెలంగాణలో మొత్తం భూముల ధరలు పడిపోతాయన్నారు. కానీ తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఎక్కడికి పోయినా ఎకరా పది లక్షల పైమాటే తప్ప తక్కువ లేదు. ఇంత డిమాండ్‌ ఉండటంవల్ల భవిష్యత్‌లో ఇంకా వివాదాలు పెరిగే అవకాశమున్నది. అశాంతి వస్తుంది. భూ తగాదాల కారణంగా మనుషులు పొడిచి చంపుకుంటున్రు. అలాంటి దుస్థితి రావొద్దంటే కచ్చితంగా పారదర్శకత, జవాబుదారీతనం రావాలి. అవినీతి అంతంకావాలి. సామాన్య పౌరుడికి ప్రతిదీ తెలియాలి. అందుకే రెవెన్యూ కోర్టులు ఉండవు. శాఖ తన బాధ్యత నిర్వర్తిస్తది. ఆ తర్వాత వివాదాలుంటే సివిల్‌ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

16 ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు

ప్రస్తుతం రాష్ట్రంలో తాసిల్దార్‌, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్న మూడు కోర్టుల వద్ద 16,137 కేసులు ఉన్నయి. అందులో ఆర్వోఆర్‌ 12 వేలు, టెనెంట్సీ కేసులు 316, ఇనామ్‌ అబాలిషన్‌ కేసులు 1,138, భూదాన్‌ కేసులు12, పీవోటీ 728, భూ ఆక్రమణ కేసులు 30, ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులరైజేషన్‌ ఇన్‌ షెడ్యూల్‌ ఏరియాస్‌ కేసులు 136, ఇతర కేసులు 1,165  ఉన్నయి. వీటన్నింటినీ తక్షణం శాఖ నుంచి తొలిగిస్తున్నం. వెంటనే 16 ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేస్తున్నం. ప్రతి వెయ్యి కేసులకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేస్తున్నం. టైం లిమిట్‌ ఉంటుంది. హైకోర్టు సూచన ప్రకారం ఏర్పాటుచేస్తున్నం. 60-70 రోజుల్లో కేసులన్నీ పరిష్కారమవుతయి. ఆ పీడ పోతది. ఆ తర్వాత మన దగ్గర కేసులు ఉండవు. ఏదైనా ఉంటే సివిల్‌ కోర్టుకు వెళ్లాలి. అప్పుడు ఎలాంటి గొడవ ఉండదు. 


logo