శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 01:28:27

పెండ్లికీ సెలవు తీసుకోలే

పెండ్లికీ సెలవు తీసుకోలే

  • కరోనా విధుల్లోనే తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి కీర్తి
  • అసోంకు వెళ్లి వివాహమాడిన వరుడు ఆదిత్య

హైదరాబాద్‌: బంధువుల ఇంట్లో పెండ్లి అంటేనే వారం రోజులు సెలవు కావాలని ఆఫీసులో అడుగుతాం. ఇక మన పెండ్లి అంటే కనీసం నెల రోజులైనా తీసుకుంటాం. కానీ అసోంలో విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి తన పెండ్లికి ఒక్కటంటే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు.  కాబోయే భార్య మనసును మెచ్చిన పెండ్లి కొడుకు ఆమె దగ్గరికే వెళ్లి తాళి కట్టాడు. జల్లి కీర్తి 2013 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. అసోంలోని కఛార్‌ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పుణెకు చెందిన ఆదిత్య శశికాంత్‌తో పెండ్లి నిశ్చయమైంది. గత బుధవారం పెండ్లి. పెండ్లి కోసం కీర్తి హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. కానీ కఛార్‌లో ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. దీంతో ఆమె అక్కడే ఉండి విధులు నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. అర్థం చేసుకున్న ఆదిత్య ముహూర్తానికి రెండు వారాల ముందే అసోం వెళ్లి క్వారంటైన్‌లో ఉన్నారు. ముహూర్తం రోజున కీర్తిని వివాహం చేసుకున్నారు. పెండ్లి నిరాడంబరంగా జరిగింది. ఇద్దరి తల్లిదండ్రులు సహా అందరూ ఈ పెండ్లిని జూమ్‌ యాప్‌లోనే చూశారు.logo