బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 06:52:48

‘ఆరోగ్యసేతు’తో ఆరోగ్యం

‘ఆరోగ్యసేతు’తో ఆరోగ్యం

  • స్వీయ పరిశీలనకు దోహదంచేసే కరోనా వైరస్‌ ట్రాకింగ్‌కు యాప్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నది. కరోనా వైరస్‌ ట్రాకింగ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను రూపొందించింది. వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, తాజాపరిస్థితులు ప్రజలకు అందించేలా నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ద్వారా ఈ యాప్‌ వినియోగంలోకి వచ్చింది. కొన్నిరోజుల్లోనే ఈ యాప్‌ను లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ ద్వారా బ్లూటూత్‌ లొకేషన్‌, మొబైల్‌ ఫోన్‌నంబర్‌ ఆధారంగా వైరస్‌ బారిన పడ్డవారిని కలిశామా లేదా ఈ యాప్‌తో స్వయంగా తెలుసుకోవచ్చు. యాప్‌ ఐవోఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలకు కూడా అందుబాటులో ఉంది. 


డౌన్‌లోడ్‌, ఇన్‌స్టాల్‌ ఇలా..

ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ప్లేస్టోర్‌ నుంచి, ఐఫోన్‌ వినియోగదారులు యాప్‌స్టోర్‌ నుంచి ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇది హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు, గుజరాతీ, కన్నడ, తమిళం, మలయాళం, ఒరియా, పంజాబీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. యాప్‌ను ఓపెన్‌చేసిన వెంటనే భాషను ఎంచుకోవాలి. యాప్‌ డౌన్‌లోడ్‌ సమయంలో మొబైల్‌ నంబర్‌, బ్లూటూత్‌ లొకేషన్‌ వంటి పర్మిషన్లు అడుగుతుంది. ప్రభుత్వం రూపొందించిన యాప్‌ కావడంతో పర్మిషన్లు ఇవ్వడానికి  భయపడాల్సిన అవసరం లేదు. యాప్‌లో మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ చేసిన అనంతరం ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. పేరు, వృత్తి, వయసు, విదేశాలకు వెళ్లివచ్చారా? వంటి ప్రశ్నలను సమాధానం ఇవ్వాలి. యాప్‌లో తమనుతాము వాలంటీర్లుగా నామినేట్‌ చేసుకునే అవకాశం ఉంది. 

వైరస్‌ పరీక్ష మీరే చేసుకోవచ్చు

వైరస్‌ సోకిందా అని స్వయంగా పరీక్ష చేసుకునేందుకు యాప్‌లో ‘సెల్ఫ్‌ అసెస్మెంట్‌ టెస్ట్‌పై’ క్లిక్‌ చేస్తే చాట్‌బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో వయసు, లింగం, ఆరోగ్య పరిస్థితి వివరాలను నమోదుచేస్తే ప్రమాదస్థాయిని యాప్‌ తెలుపుతుంది. మీ ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ ఉంటే కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండటంతోపాటు ఇతరులకు వ్యాపించకుండా ప్రభుత్వానికి సహకరించినట్టవుతుంది.

ఆకుపచ్చ రంగు వస్తే క్షేమం

యాప్‌ ఇన్‌స్టాల్‌ ప్రక్రియ పూర్తిచేశాక పైభాగంలో ఆకుపచ్చ రంగు వస్తే క్షేమంగా ఉన్నట్టు. ఇది వైరస్‌ బారిన పడకుండా సామాజిక దూరం పాటించి, ఇంట్లోనే ఉండాలి వంటి జాగ్రత్తలను తెలుపుతుంది. ఒకవేళ మీరు ఇచ్చిన సమాధానాల ప్రకారం పైభాగంలో పసుపు రంగులో కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. కరోనా వైరస్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తుంది. వెంటనే అధికారులను సంప్రదించడం మంచిది. ఇందులో కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌ సెంటర్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 


logo